
జూబ్లీహిల్స్ లో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..
హైదరాబాద్ లో మరో విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఓ బాలుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు. వివేక్ అనే బాలుడు మంగళవారం ఉదయం నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డాడు.
గత కొద్దు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంత నీటితో నిండిపోయింది. వివేక్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చింది.
మృతుని తండ్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఓ బైక్ షోరూంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
వేసవి సెలవులు కావడంతో మృతుడు వివేక్ బయటకు వెళ్లి ఆడుకుంటూ నీటి గుంతలో పడిపోయి చనిపోయాడని పోలీసులు చెప్పారు.
రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కరెంట్ షాక్ తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ఒకరు మృతి చెందారు.
సోలేం వీరాస్వామి(45) అనే గ్రే హౌండ్స్ లో పనిచేసే కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి 9.40 గంటల సమయంలో యూసుఫ్ గూడా బెటాలియన్ లో పని చేసే తన తమ్ముడిని కలిసి, తిరిగి బైక్ పై వెళ్తున్న క్రమంలో బైక్ మీద వెళ్తుండగా TV5 నుంచి NTR భవన్ వైపు ఫ్రీ లెఫ్ట్ దారిలో వెళ్తుండగా భారీ వర్షం,
బలమైన ఈదురు గాలులా కారణంగా అదుపు తప్పి బైక్ తో సహా ఫుట్ పాత్ పై పడ్డాడు. అక్కడ కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు.
డయాల్ 100 ద్వారా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి చూడగా వీరస్వామిలో చలనం లేదు.
వెంటనే అంబులెన్సు లో అతన్ని అపోలోకు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. వీరస్వామి కుటుంబంతో పాటు గండిపేట క్వార్టర్స్ లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సికిందాబాద్ కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి చనిపోయింది.
హైదరాబాద్ లో వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. వివేక్, మౌనిక మృతు చెందడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.