
మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది.
మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది. రేపు పెళ్లి అనగా వరుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.
ఈ విషాద ఘటన మహబూబాబాద్ మండల పరిధిలోని కొమ్ముగూడెంలో తండాలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దవాడు యాకూబ్ (21) హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల యాకూబ్‌కు గార్ల మండల శివారు పీక్లీతండాకు చెందిన బోడ శివ-సక్కు దంపతుల పుత్రికతో వివాహం నిశ్చయమైంది.
బంధువులంతా ఇంటికి చేరుకోగా.. సందడి నెలకొన్నది. అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో నీరు అయిపోవడంతో బోర్ మోటార్ స్విచ్ వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే బంధువులు స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మృతి చెందాడు. తెల్లారితే పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు.. పాడెక్కడంతో తండాలో యాకూబ్ ఇంటితో పాటు వధువు ఇంట విషాదం అలుముకున్నది. యూకూబ్ మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.