ఫీజు రీయింబర్స్‌మెంట్ గోస

ఫీజు రీయింబర్స్‌మెంట్ గోస..
రాష్ట్రంలో బీసీల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20లో ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌కు కేటాయించిన రూ.299 కోట్లలో ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. 2021-22లోనూ ఈ స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించిన రూ.254.19 కోట్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక ప్రభుత్వ హాస్టల్స్‌కు 2018-19లో కేటాయించిన నిధుల్లో 36%, 2020-21లో 61%, 2021-22లో 81% నిధులు ఖర్చు చేయలేదు. వెనుకబడిన వర్గాల రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజీల సొసైటీకి 2018-19లో చేసిన కేటాయింపుల్లో 46% ఖర్చు చేయలేదు. 2020-21లో 74%, 2021-22లో 54% నిధులు ఖర్చు చేయలేదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బీసీ బంధు ఏది..?
దళితబంధు తరహాలో బీసీ బంధు పథకం ప్రారంభిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నీటి మీద రాతగా మిగిలింది. సబ్సిడీ రుణాల కోసం లక్షలాది మంది బీసీలు దరఖాస్తు చేసుకొని ఐదేండ్లుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ సుష్క వాగ్దానంగానే మిగిలింది. బీసీల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఉద్యోగ, రాజకీయ నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. – భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత