
“బాధ్యత కలిగిన కుటుంబములో భార్యా భర్తల పాత్ర కీలకమైనది.”
“ఆదర్శంగా నిలిచే కుటుంబం తీసుకునే ప్రతిష్టత్మక నిర్ణయాలు సమాజంలో పెనుమార్పును తీసుకొస్తాయి.”
ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడవలసిన అవసరత భర్తపై ఉంది. అప్పుడే ఆమె అందరి యోగ క్షేమలు చూడగలదు..
కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చినది ఆమె యొక్క ప్రజ్ఞను గమనించే. శుచి, శుభ్రత వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్ని ఆమె పాటించి, కుటుంబ సభ్యుల చేత పాటింప చేయడం ద్వార ఆమె ఒక వైద్యురాలు అనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు.
పిల్లలకు విద్య బుద్ధులునేర్పి మంచి గుణములు, నడవడిక అలవాటు చేసి, సమాజమునకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వార “ఆమె ఒక గురువు”. భర్తకు అనుగుణంగా నడచుకొని, అతని ఆజ్ఞలు పాటించి, ఆతను చెడు దారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె “ఒక మంత్రిగా” మనం అంగీకరించితీరాల్సిందే..!
భార్య “ఆర్ధిక మంత్రిగా ఉన్న కుటుంబాల్లో ఆర్ధిక సమస్యలు ఉండవు.” నేను చెప్పేది రాజకీయపరంగా ఉండే ఆర్థిక మంత్రికాదు. కుటుంబ పరంగా భార్య ఆర్ధిక విషయాల్లో ఆమెకు ఆర్ధిక మంత్రి పాత్రల్లో ఉండేవారి గురించి.
అదే విధంగా “సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉండాలి అన్నాడు మనువు”. వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్ధిక వేత్త.
ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. ఇంట్లో ఎంతో అవసరమైన ఖర్చు వచ్చినపుడు పిల్లలతో సహా, భర్తకు కూడా ఎక్కడో అక్కడనుంచి తీసి డబ్బు సర్దగల సమర్ధురాలు స్త్రీ. అలాగే “ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది.”
భార్యా తాను కస్టపడి చేస్తున్న ఇంటిపనుల్లో ఎక్కడైన తన భర్త గుర్తించి అభినందిస్తాడేమో.. అనే ఆశకలిగి ఉంటుంటుంది. కానీ అడుగడున జరిగే అవమానాన్ని బట్టి కుమిలిపోతుంది భార్య…
కుటుంబంలో స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం చిరునవ్వుతో వర్దిల్లుతుంది. హిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి.
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా” అని ఆనాడే చెప్పబడింది. స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.
ఇతర సంస్కృతుల కన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతీ మహిళకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టినది ఆమెను ఇంట్లో కట్టిపడేయ డానికి కాదు. కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది…
భర్త ఎంతటి మూర్ఖుడైనా ప్రాణం అరచేతుల్లో బిగబట్టి కుటుంబ పరువును కాపాడాలని తన శక్తికొలదిగా స్త్రీ ప్రయాసపడుతుంది.
ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను గౌరవించే వేళ ఆమె అన్నపూర్ణ. పిల్లల సంరక్షణ, పెద్దవారి సేవ, అతిథి అభ్యాగాతుల సేవ, ఇలా ఎన్నో పనులు ఒకేసారి చేయగల సామర్థ్యం ఆమె సొత్తు. ఇలా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర.
“ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, కుటుంబం మిద ప్రభావం చూపుతాయి”. ఆమె పాత్ర వాళ్ళ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. “ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడిన, లేదా చెడిపోయిన దానికి బాధ్యురాలు స్త్రీయే.”
నేడు పురుష అహంకారంతో అడుగడుగున స్త్రీని తక్కువగా అంచనావేస్తూ అణిచివేయడం దుర్మార్గం. అలజడితో పచ్చటి సంసారాన్ని కూల్చివేయాలనీ ఏ స్త్రీ సహజంగా కోరుకోదు.
కానీ తనపట్ల చూపబడే వివక్షతోనే కొన్నిసార్లు స్త్రీ సహనం కోల్పోయినదై ఏమిచేయాలో అర్ధంకాక తనువు చాలిస్తున్నారు. స్త్రీ శారీరిక శక్తీలో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ, మానసిక శక్తిలో ఆమెకు ఎవరు సాటిలేరు.
కుటుంబాలు అన్ని సంతోషంగా ఉంటె సమాజంలో సంతోషం నిండుతుంది. లోకంలో ఇబ్బందులుండవు. ఇది స్త్రీకి మన సంస్కృతీ ఇచ్చిన అసలు స్థానం. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న కొద్దీ, సమాజంలో స్త్రీకి గౌరవం లేకుండా పోతోంది. ఆమె మిద ఎన్నో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితిని ఎదుర్కొని మళ్లీ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంపోదించే దిశగా అందరు కృషి చేయాలి.. అప్పుడే ప్రతి కుటుంబం ఒక బాధ్యత కలిగి సమాజంలో నలుగురికి ఆదర్శవంతంగా ఉండగలరు..
-డాక్టర్ పీటర్ నాయక్ లకావత్, మోటివేషనల్ స్పీకర్