
అమ్మ నాన్నలను కలపండి.. అంటూ నిజామాబాద్ లో కొందరు చిన్నారులు మండుటెండలో వినూత్నంగా నిరసన తెలిపారు. అదేంటి వాళ్ళ అమ్మానాన్నలు విడిపోయారా?
పిల్లలు అమ్మానాన్నలను కలపాలని ఆందోళన చేయడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే..
వారు ప్రభుత్వ టీచర్లు.. భర్త ఒక చోట భార్య ఇంకోచోట ఉద్యోగం. భార్య భర్తలు కలిసి లేకుండా చెరొక చోట ఉద్యోగం చేస్తున్న క్రమంలో పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో మా అమ్మ నాన్నలను కలపండి అంటూ పిల్లలు ప్లకార్డులు పట్టుకొని వినూత్నంగా నిరసనకు దిగారు.
నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే భార్యాభర్తలు ఒకే చోట పని చేసే విధంగా బదిలీలు చేపట్టాలని గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, అన్నిచోట్ల ఆ విధంగా బదిలీలు జరగలేదు. దీంతో స్పౌజ్ బదిలీలపై నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ టీచర్లు వినూత్న నిరసనకు దిగారు. తమ గోడు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు.
కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు తమ చిన్నారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇక పిల్లలు కూడా మా అమ్మానాన్నలను కలపండి అంటూ ప్లకార్డులు పట్టుకొని మండుటెండలో ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 13 జిల్లాల్లో స్పౌజ్ టీచర్లను తక్షణం బదిలీ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు.
భార్య భర్తలు వేరు వేరు చోట విధులు నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం తమ ట్రాన్స్ఫర్ లను చేయాలని వారు డిమాండ్ చేశారు. స్పౌజ్ ఫోరం నిర్వహించిన ఈ ఆందోళనలో పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. అమ్మ ఒక చోట.. నాన్న ఒక చోట మరి నేనెక్కడ అని ప్రశ్నించడం అందర్నీ ఆలోచించేలా చేసింది.