
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో ట్విస్ట్ నెలకొంది. విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది.
ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై శ్రీ కృష్ణ జేఏసీ, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం హైకోర్టులో పిటిషన్ వేశాయి. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది.
ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్ణయించారు. మే 28న విగ్రహం ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లడం కూడా కూడా ఫిక్స్ అయింది. మే 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆ రోజున ప్రారంభిస్తే బాగుంటుందని నిర్వాహకులు భావించారు. అయితే కోర్టు స్టే ఇవ్వడంతో విగ్రహం ఏర్పాటుపై గందరగోళం ఏర్పడింది.
ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే విగ్రహం తయారీ కూడా పూర్తైన్నట్లు తెలుస్తోంది. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు, శరీర భాగం 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్ పైన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహానికి రూ.2.3 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.