మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

ఛత్తీస్‌గఢ్ : మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో జవాన్లతో వెళ్తున్న మినీబస్సును మందుపాతర పెట్టి పేల్చడంతో 11 మంది జవాన్లు మృతి చెందారు.
మృతులను డిఫెన్స్ రీసెర్చ్ గ్రూప్‌నకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో 10 మంది డీఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు , ఇతర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు గాను రాయ్‌పూర్ నుంచి హెలికాఫ్టర్ బయల్దేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ప్రతి ఏడాది 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతున్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పీ చెప్పిన మరుసటి రోజే ఈ దాడి జరగడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్ పోలీస్ ప్రత్యేక దళం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)లో ఎక్కువగా పోలీసులు, మావోయిస్టులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన స్థానిక గిరిజనులు వుంటారు.
వామపక్ష తీవ్రవాదానికి కేంద్రమైన బస్తర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో తిరుగుబాటుదారులపై అనేక విజయవంతమైన ఆపరేషన్లలో డీఆర్‌జీ కీలకపాత్ర పోషించింది. ఆరు దశాబ్ధాలుగా వందలాది మందిని బలిగొన్న మావోయిస్ట్ ఉద్యమం ఈ ప్రాంతంలో రక్తపుటేర్లను పారించింది. 1967 నుంచి భారతదేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలపై మావోయిస్టులు నియంత్రణను సంపాదించారు. దీనిని ”రెడ్ కారిడార్” అని పిలుస్తారు.