Telangana

మలిదశ స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మలిదశ స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలి
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ
దేశాన్ని ఆదానీ బారి నుంచి కాపాడుకుందాం

బీజేపీ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం మలి స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మలి స్వాతంత్ర్య పోరాటానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని, ఈ పోరాటంలో అంతా ముందుండి కొట్లాడి దేశాన్ని ఆదానీ బారి నుంచి కాపాడుదామన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని, నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని తెలిపారు. మోదీ, అమిత్ షా లు డొల్ల కంపెనీలతో ఆదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టారని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే రాహుల్ ను అడ్డుకున్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని చెప్పారు. తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆదానీ-ప్రధాని అని విమర్శించారు. ఆదానీ ఇంజన్ కు రిపేరు వచ్చిందని ప్రధానికి భయం పట్టుకుందన్నారు. పప్పు అని అవహేళన చేసిన బీజేపీకి రాహుల్ నిప్పు అని తెలుసుకున్నారని… అందుకే రాజకీయ కక్షతో రాహుల్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారని ఆరోపించారు. ఆదానిపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్ పై అనర్హత వేటు వేశారన్నారు. రాహుల్ గాంధీని చూసి మోదీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోందన్నారు.

ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ కు ఉరి శిక్ష వేశారని, క్షమాపణ కోరితే ఉరిశిక్ష రద్దు చేస్తామని బ్రిటీషర్లు అడిగారని తెలిపారు. కానీ భగత్ సింగ్ ఉరికొయ్యకు వేలాడాడు తప్ప క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు రేవంత్. భగత్ సింగ్ వారసుడిగా రాహుల్ గాంధీ ఎవరికీ తల వంచడు… క్షమాపణ చెప్పడని తెలిపారు. తల వంచేది లేదు.. క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ స్పష్టం చేశారన్నారు. మనమంతా భగత్ సింగ్, పటేల్, గాంధీ, సుభాష్ చంద్రబోస్ వారసులమని, మోదీ, అమిత్ షా ఎవరూ మనల్ని ఏం చేయలేరని చెప్పారు.

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. నాడు బ్రిటీష్ విభజించు… పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన ఆరోపించారు. వ్యాపార ముసుగులో బ్రిటీషర్స్ దేశంలో అడుగుపెట్టింది గుజరాత్‌లోని సూరత్‌లోనే అన్నారు. బ్రిటీష్ దొరలను దేశం నుండి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. గాంధీ, నెహ్రు, పటేల్ దేశ నిర్మాణానికి పునాదులు వేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పునాదులతోనే ఈ దేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు. సర్దార్ పటేల్‌కు బీజేపీకి ఏమిటి సంబంధమో అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్.ఎస్.ఎస్‌ను నిషేధించింది సర్దార్ పటేల్ అని, గాంధీ భవన్ నిర్మాణానికి పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన డీఎస్

సీనియర్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు సమక్షంలో గాంధీ భవన్ లో పార్టీ కండువా కప్పుకున్నారు. ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్‌తో పాటు ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని డీఎస్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ఊహించిన దానికంటే గొప్పగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected