
మాటల మరాఠీ కేసీఆర్…!
మీ కథేంది… మీ చరిత్రేంది… గూడెం సమ్మేళనంలో చెప్తా…
మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ కలలు కంటుంది
ఆ కలలు కల్లాలుగా మిగిలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్
లీకేజీ వ్యవహారంలో ఉన్నదంతా మీ మంత్రులే
మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం నేటికీ అందలేదు
రైతుల రూ.లక్ష రుణమాఫీ ఊసేలేదు
బోనకల్, మధిర, ఎర్రుపాలెం క్యాంపు కార్యాలయాల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలు
మధిర : మాయమాటలు చెప్పడంలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడని…. మాటలతో గారడీ చేస్తూ…. మభ్యపెడుతూ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆయన మూడోసారి కూడా అధికారం చేపడతామనే భ్రమలో అనేక కలలు కంటున్నారని… ఆ కలలు కల్లాలుగా మిగిలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాలను ఆయన శనివారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సీఎం కేసీఆర్ చేసిన అన్ని వ్యవహారాలను కొత్తగూడెంలో ఆదివారం జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావిస్తానన్నారు. ఆయన కథేంది… చరిత్రేంది… అనేది ఆధారాలతో సహా సభలో మాట్లాడుతానని తెలిపారు. మధిర నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తానన్నారని తెలిపారు. పక్షం రోజులు గడుస్తున్నా నేటికి ఆ పరిహారం ఏ ఒక్క రైతు సోదరునికి అందలేదని విమర్శించారు.
రైతుల రూ. లక్ష రుణమాపీ ఊసే లేదని ఎద్దేవా చేశారు. లీకేజీ వ్యవహారంలో ఉన్నదంతా బీఆర్ఎస్ పార్టీ మంత్రులేనని… సిట్ వారి చుట్టమేనని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో శీనన్న క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పదవి ఉన్న నాడు విర్రవిగలేదని లేని నాడు కుంగిపోలేదని తెలిపారు. నాడు నేడు ఒకేలా ఉంటున్నానని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలే తనకు ముఖ్యమన్నారు. తనతో పాటు తన వెంట నడిచే నాయకులందరికీ ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.
– బైక్ ర్యాలీకి విశేష స్పందన
పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సం సందర్భంగా మధిర నియోజకవర్గంలో శీనన్న అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. వందల సంఖ్యలో శీనన్న అభిమానులు బైక్ ర్యాలీలో పాల్గొని శీనన్నపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి ముందు బోనకల్ మండలంలోని జానకీపురంలో అంబేద్కర్, బాబు జగజ్జీవనరాం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.