
ఏసీబీకి చిక్కిన బోడుప్పల్ విద్యుత్ ఏఈ
రూ.10 వేలు లంచం తీసుకుంటూ..
విద్యుత్ ప్యానెల్ బోర్డు మంజూరు కోసం అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రసాద్‌బాబు ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు.
ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సఫిల్‌గూడలో నివసిస్తున్న ప్రసాద్‌బాబు చిలుకానగర్ (బోడుప్పల్) విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీరుగా రెండేళ్లుగా పని చేస్తున్నాడు.
బోడుప్పల్ ఇందిరానగర్‌కు చెందిన మామిళ్ల నవీన్‌కుమార్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. కొత్తగా నిర్మించే అపార్టుమెంట్ల వద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ తీసుకుని విద్యుత్ మీటర్ల నుంచి వైరింగ్ పని చేస్తుంటాడు. బాలాజీ హిల్స్ కాలనీలో నిర్మిస్తున్న ఓ అపార్టుమెంట్‌ను కాంట్రాక్ట్ తీసుకున్నాడు. విద్యుత్ మీటర్ల ప్యానెల్ బోర్డు కోసం నవీన్‌కుమార్ దరఖాస్తు చేశాడు. ఏఈ ప్రసాద్‌బాబు వాటిని మంజూరు చేసేందుకు రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
మంగళవారం ఉదయం నవీన్‌కుమార్ ఏఈ ప్రసాద్‌బాబును కలవగా అతని కింద పని చేసే లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. శ్రీనివాస్ వద్దకు వెళ్లి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా అతను ఏఈ ప్రసాద్ బాబు వద్ద పని చేసే ప్రైవేట్ వ్యక్తి గౌతమ్‌కు ఇవ్వాలని చెప్పాడు.
ఉదయం 11 గంటలకు బోడుప్పల్ విద్యుత్ కార్యాలయంలో నవీన్‌కుమార్ రూ.5 వేలు లంచంగా గౌతమ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గౌతమ్ వద్ద పట్టుకున్న రూ.5 వేలతో పాటు నవీన్‌కుమార్ వద్ద ఉన్న మరో రూ.5 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏఈ ప్రసాద్‌బాబు, లైన్‌ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ గౌతమ్‌ల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని వారిని విచారించారు. మల్కాజిగిరిలోని ప్రసాద్‌రాబాబు ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సతీష్, ఆజాద్, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డబ్బులు ఇవ్వనిదే ఏ పనీ కాదు..
ఏఈ ప్రసాద్‌బాబు డబ్బులు ఇవ్వనిదే పనులు చేసేవాడు కాదని.. ఈ పరిస్థితిని చూసే చాలా మంది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్‌లు పనులు మానుకున్నారని మేడ్చల్ జిల్లా ‘ఎ’ గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ అన్నారు.
ప్రైవేట్ వ్యక్తిని అసిస్టెంట్‌గా పెట్టుకుని ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తున్నారని, ఏఈ ప్రసాద్‌బాబు వేధింపులు తట్టుకోలేక పలువురు కాంట్రాక్ట్ పనులు మానుకున్నట్లు ఆయన చెప్పారు.