వైద్యం వికటించి.. చిన్నారి మృతి

జ్వరంతో బాధపడుతున్న చిన్నారికి గ్రామీణ వైద్యుడు చేసిన వైద్యం వికటించి, 5 నెలల బాలిక స్నేహలత మృతి చెందిన సంఘటన బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే, వనపర్తి జిల్లా,కొత్తకోట మండలం,అప్పరాలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి,బీసన్న దంపతులు రోడ్డు పనుల( కూలి పనుల)నిమిత్తం బొంరాస్ పేట మండలంలోని తుంకిమెట్ల గ్రామం లో ఉంటున్నారు.
వీరి కూతురు స్నేహలత(5నెలల చిన్నారి)కు జ్వరం రావడంతో, తల్లిదండ్రులు గురువారం ఉదయం గ్రామంలోని గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీ డాక్టర్) బాలు నాయక్ వద్దకు తీసుకెళ్లారు.
ఆయన చికిత్స చేసి,సిరప్(మందులు) ఇచ్చి పంపించాడు.అయితే సాయంత్రం వరకు చిన్నారికి జ్వరం తగ్గక పోవడంతో,మరోసారి వైద్యుని దగ్గరకు తీసుకొచ్చారు.మరోసారి చికిత్స చేసి,మందులు ఇచ్చాడు.
మందులు వేసుకున్న చిన్నారి కొద్దిసేపటికే వాంతులు చేసుకొని, మృతి చెందింది.ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి,చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వైద్యుడు బాలు నాయక్ స్వస్థలం వికారాబాద్ జిల్లా,దోమ మండలం,దిర్సంపల్లి పెద్ద తండాకు చెందినవాడు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం,పరిగి ఆసుపత్రికి పంపించి,వైద్యుడు బాలు నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని,విచారిస్తున్నారు.