మెడిగడ్డ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య

*మెడిగడ్డ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య*

సామాజిక కార్యకర్త దారుణ హత్య

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణహత్య జరిగింది. ప్రజావేగు, సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆయన హత్యకు కారణాలు తెలియరాలేదు. పలు భూ, ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేసిన ఆయన, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఏడో బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి రాజలింగమూర్తి ద్విచక్రవాహనంపై తన నివాసానికి బయలుదేరారు.

పూర్తి నిర్మానుష్యంగా ఉండే టీబీజీకేఎస్‌ కార్యాలయ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు రాజలింగమూర్తిని అడ్డగించారు. అనంతరం ఆయనపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. పొట్టలోంచి పేగులు బయటపడి.. ముఖంపై తీవ్రగాయాలై ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. దుండగులు తామొచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పరారయ్యారు. అటుగా వచ్చిన కొందరు రక్తపుమడుగులో పడివున్న రాజలింగమూర్తిని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.

వారొచ్చి ఆయన్ను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు చెప్పారు. ఘటనాస్థలి వద్ద సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడిలో ఐదారుగురు పాల్గొన్నట్టు సమాచారం. భూపాలపల్లి పట్టణంలోని రెడ్డికాలనీ చెందిన రాజలింగమూర్తి సతీమణి సరళ స్థానిక మునిసిపల్‌ 15వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్‌ఎస్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు రాజకీయ కారణాలతో ఆమె, రాజలింగమూర్తి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వారు ఏ పార్టీలో లేరని తెలుస్తోంది. రాజలింగమూర్తి తొలి నుంచి ప్రజాసమస్యల పేరుతో పలు అంశాలపై కోర్టులో కేసులు వేశారు.

భూపాలపల్లిలో పలు భూ ఆక్రమణలు జరిగాయని, అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపణలు చేశారు. భార్య సరళ బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పటికీ 2023 అక్టోబరు 23న మేడిగడ్డ 7వ బ్లాక్‌ కుంగిన ఘటనపై కేసీఆర్‌, హరీశ్‌రావు, ప్రాజెక్టు ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఆయన పిటిషన్‌ వేయడం సంచలనమైంది. ఆ కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పువచ్చింది. 2024 సెప్టెంబరులో కోర్టు కేసీఆర్‌, హరీశ్‌, ఇంజనీర్లకు సమన్లు జారీచేసింది. కేసీఆర్‌, హరీశ్‌, ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు.

జిల్లా కోర్టు తీర్పుపై స్టే విధించిన హైకోర్టు, తుదితీర్పును గురువారం వెలువరించనుంది. ఇక భూపాలపల్లి శివారులోని సర్వే నెం 171లో విలువైన అటవీ భూమిని అప్పటి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అక్రమంగా ఇతరులకు కేటాయించారని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Ck News Tv

Ck News Tv

Next Story