*రాజీవ్‌ యువ వికాసం ద్వారా యువతకు రూ.4 లక్షలు.. మంచి ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోవాలి*

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ దరఖాస్తుల ప్రక్రియను ఇవాళ ప్రారంభించనున్నారు.

*ఏప్రిల్ 5 వరకు..*

ఈ పథకానికి సంబంధించి.. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పథకం విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు భట్టి.

*రూ.6 వేల కోట్ల నిధులు..*

రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చుచేయాలని.. రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. చాలా రోజుల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండటంతో.. భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

*ప్రభుత్వం నిర్ణయం..*

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు రూ.1200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ రూ.360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో కూడా ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నాయి. దీంతో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*బీసీలకే ఎక్కువ..*

ఇటు బీసీల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన రూ.2 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.

*3 కేటగిరీలుగా..*

ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 క్యాటగిరీలుగా విభజించారు. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు. అందులో 70 శాతం రాయితీ కల్పిస్తారు. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనున్నారు. అందులో 60 శాతం రాయితీ లభిస్తుంది.

*ముఖ్యమైన వివరాలు..*

పథకం పేరు- రాజీవ్ యువ వికాసం

ప్రారంభించేది- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రారంభ తేదీ- 2025, మార్చి 17

ఉద్దేశం- స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం

లబ్ధిదారులు- తెలంగాణ పౌరులు

లక్ష్యం- 5 లక్షల మంది ఉపాధి కల్పించడం

ప్రయోజనం- గరిష్టంగా రూ. 3 లక్షల సాయం

అర్హులు- తెలంగాణలోని నిరుద్యోగ పౌరులు

అవసరమైన పత్రాలు- ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్

దరఖాస్తు ప్రక్రియ- ఆన్‌లైన్ ద్వారా

అధికారిక వెబ్‌సైట్ - tgobmms.cgg.gov.in


Updated On 17 March 2025 8:29 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story