సర్వే ఆపుతారా..? ఆత్మహత్య చేసుకోవాలా..?

సర్వే ఆపుతారా..? ఆత్మహత్య చేసుకోవాలా..?
మక్తల్ : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. నిత్యం పనులు చేసేందుకు అధికారులు రావడం.. తమ భూముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నారు.
సోమవారం మక్తల్ మండలం కాట్రేవుపల్లి సర్వే కోసం వెళ్లిన అధికారులకు భంగపాటు తప్పలేదు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నీటిపారుదల, రెవెన్యూ శాఖాధికారులు భూసర్వే చేపట్టడానికి పోలీస్ బందోబస్తుతో రైతుల పొలాల్లోకి వెళ్లారు.
విషయం తెలుసుకొన్న రైతులందరూ పెద్ద ఎత్తున చేరుకొని అడ్డుకున్నారు. అయినా వినని అధికారులు మీరు ఆందోళన చేసినా పనులు ఆగవని బెదిరించే యత్నం చేశారు. అయినా రైతులు వినలేదు. దీంతో పోలీసులతో కలిసి రైతులు భూముల వద్దకు రాకుండా అడ్డుకున్నారు.
దీంతో చేసేది లేక భూమి కోల్పోతున్న కాట్రేవుపల్లికి చెందిన రైతు వెంకటేశ్‌గౌడ్ పెట్రోల్ బాటిల్‌తో అధికారుల ముందుకొచ్చాడు. సర్వే పనులు నిలిపివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
ఇది ఫైనల్ సర్వే కాదని సూచించినా ఎవరూ వినలేదు. దీంతో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే పనులు నిలిపివేశారు. రైతులు భారీగా తరలిరావడంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీవో వద్దకు ఐదు మంది రైతులను తాసీల్దార్ తీసుకెళ్లాడు.
