లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు...
70 వేలతో దొరికిన విద్యుత్ శాఖ ఏడీ.., రూ.20 వేలతో పట్టుబడ్డ ధర్మపురి పురపాలక కమిషనర్
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏడీ(ఆపరేషన్స్) గాజుల శ్యామ్‌ప్రసాద్. చౌటుప్పల్‌లో విద్యుత్ శాఖ ఏడీ, ధర్మపురిలో పురపాలిక కమిషనర్ లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌర విద్యుత్తు వినియోగ అనుమతి విషయమై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని విద్యుత్తు శాఖ కార్యాలయంలో ఏడీ(ఆపరేషన్స్) గాజుల శ్యామ్‌ప్రసాద్ ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా (ఏసీబీ) నల్గొండ విభాగం డీఎస్పీ జగదీశ్ చందర్, ఇతర అధికారులు గురువారం పట్టుకున్నారు.
చౌటుప్పల్ పురపాలిక పరిధి తంగడపల్లిలోని అక్రీట్ ఫార్మాలో సౌర విద్యుత్తు ప్లాంటును నిజామాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ అమర్చింది. ఈ ప్లాంటు నుంచి సౌర విద్యుత్తును వినియోగించుకునేందుకు నెట్ మీటర్ ఏర్పాటు చేయించి విద్యుత్తు శాఖతో సింక్రనైజేషన్ చేయించాక డబ్బు చెల్లిస్తామని సోలార్ సంస్థతో అక్రీట్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో సోలార్ సంస్థ ప్రతినిధి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేశారు. సింక్రనైజేషన్ టెస్టింగ్ రిపోర్టు ఇచ్చేందుకు తనకు రూ.70 వేలు ఇవ్వాలని ఏడీ డిమాండ్ చేయడంతో సదరు సంస్థ ప్రతినిధి ఏసీబీని సంప్రదించారు. దీంతో ఏసీబీ అధికారులు మాటువేసి ఏడీని లంచంతో పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని ఏడీ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ధర్మపురి పురపాలక కమిషనర్ శ్రీనివాస్
జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలిక కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ధర్మపురి పురపాలికలో ఒప్పంద పద్ధతిన పైడిపెల్లి మహేశ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
ఈయన చేసే పనులకు సంబంధించిన ఎంవోయూను ఉన్నతాధికారులకు పంపించడం, మూడున్నర నెలల వేతనాల చెల్లింపు కోసం కమిషనర్ లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
గురువారం రాత్రి బాధితుడి నుంచి పుర కమిషనర్ రూ.20 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తన ఉద్యోగాన్ని పునరుద్ధరించాలని పుర కౌన్సిల్ తీర్మానం చేసినా.. ఉన్నతాధికారులకు కమిషనర్ ఫైలును పంపించడం లేదని మహేశ్ పేర్కొన్నారు.
