భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..చికిత్స పొందుతూ మృతి
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..చికిత్స పొందుతూ మృతి

భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..చికిత్స పొందుతూ మృతి
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ భార్య. అయితే.. ఈ సంఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా పొలాసలో జరిగింది.
ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో జరిగింది.
పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ (58) అదే గ్రామానికి చెందిన జమునను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అనంతరం కొంతకాలం తర్వాత జమున సొంత చెల్లి లలితను రెండో పెళ్లి చేసుకున్నాడు. లలితకు కూడా కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈ నేపథ్యంలో మూడేళ్లుగా ఇద్దరు భార్యలతో కమలాకర్‌కు విభేదాలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదు నెలల క్రితం బీదర్‌కు చెందిన మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం కమలాకర్ పొలాస గ్రామంలో మొదటి భార్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. విసిగిపోయిన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు అందరూ కలిసి అతనిపై కత్తితో దాడిచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కమలాకర్ కేకలు వేయడంతో స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సధాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమలాకర్ నుంచి న్యాయమూర్తి మరణ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, కమలాకర్ సాయంత్రం 6.30 గంటలకు మృతిచెందాడు.
ఈ ఘటనలో మృతుడి కుటుంబ సభ్యులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బీదర్‌కు చెందిన మూడో భార్యను కూడా విచారిస్తున్నారు. కమలాకర్ సోదరుడి ఫిర్యాదు మేరకు మొదటి భార్య, పిల్లలు, అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.
