Uncategorized

రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లెందుకు ఇవ్వడం లేదు?

గోబెల్స్ ను మించిన ఘనుడు కేసీఆర్

-తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నడు

రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లెందుకు ఇవ్వడం లేదు?

మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో ఆలోచించండి

-టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఇంతవరకు సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు?

-సిట్ పై నమ్మకం లేదు… సిట్టింగ్ జడ్జిపైన నమ్మకం

-25న పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం

అమిత్ షా రాక నేపథ్యంలో 23న చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం

-రాజ్యాంగ పదవిలో ఉంటూ బాన్సువాడలో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న స్పీకర్

-కేసీఆర్ తరహాలోనే బాన్సువాడలోనూ కుటుంబ పాలన కొనసాగుతోంది

-స్టేషనరీ స్కాంలో అడ్డంగా బుక్కై కేబినెట్ నుండి బర్తరఫ్ అయిన వ్యక్తికి రాజ్యాంగబద్ద పదవిస్తే ఇట్లనే ఉంటది

బీజేపీ సంస్థాగత బలోపేతం సహా పలు అంశాలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి

-తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బాన్సువాడకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరిక

ముఖ్యమంత్రి కేసీఆర్ గోబెల్స్ ను మించిన ఘనుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాగడానికి మంచి నీళ్లు కూడా అందించలేని కేసీఆర్ అభివ్రుద్ధి గురించి పచ్చి అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ‘‘జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఒక్కో ఇంటికి రూ.16 వేలు ఖర్చు చేసి ఇంటింటికీ తాగు నీళ్లు అందిస్తుంటే తెలంగాణలో మిషన్ భగీరథ కింద ఒక్కో ఇంటికి రూ.60 వేలు ఖర్చు చేసినా మంచి నీళ్లు ఎందుకు అందించడం లేదు? దీనినిబట్టి మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో ఆలోచించండి’’అని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎంసహా పలుపార్టీలకు చెందిన నాయకులు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ తో కలిసి ఆయా నేతలకు కండువా కప్పి బీజేపీలోకి స్వాగతం పలికారు. అనంతరం తరుణ్ చుగ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి ఉమారాణి, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

• ఈ ప్రపంచంలోనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ ‘‘గోబెల్స్’’…. ఒక అబద్దాన్ని పదేపదే ప్రచారం చేస్తే అదే నిజమని నమ్మేలా చేసినోడు అతను. కానీ గోబెల్స్ ను మించిన అబద్దాల కోరు కేసీఆర్. మిషన్ భగీరథ గురించి ఇన్నాళ్లు ఏం చెప్పిండు? మన పాలన మనకు రావాలన్నడు. తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయన్నడు. కానీ నీళ్లేవి? ఎండా కాలమొస్తే మంచి నీళ్లకు అలమటించే రోజులు పోయినయ్. మిషన్ భగీరథ నీళ్లే సమాధానామిస్తయన్నడు. కానీ ఏమైంది? మంచి నీళ్లు అందక జనం అల్లాడుతున్నరు. నడి ఎండలో కిలోమీటర్ల కొద్ది నడిచి వ్యవసాయ బోర్ల వద్దకు పోయి నీళ్లు పట్టుకొచ్చుంటున్నరు.

• మరి మిషన్ భగీరథ పేరుతో 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ ఒక్కో ఇంటికి సగటున 60 వేల రూపాయలు ఖర్చు చేసినా ఇయాళ్టికీ నీళ్లు ఎందుకు రావడం లేదు? మరి ఆ డబ్బులన్నీ ఎటు పోయినయ్? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇంటింటికీ నీళ్లు ఇస్తోంది. ఇందుకోసం ఒక్కో ఇంటికి అయ్యే ఖర్చు 16 వేలు దాటడం లేదు. ఈ పథకం వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో దిగ్విజయవంతంగా మంచి నీళ్లు అందుతున్నయ్. మరి మిషన్ భగీరథ పేరుతో ఒక్కో కనెక్షన్ పేరుమీద 44 వేల రూపాయల కమిషన్ దొబ్బిండు. ఎంత పెద్ద స్కాం మీరో ఆలోచించండి. పైపులున్న చోట నీళ్లు రావు. నీళ్లున్న చోట పైపులుండవ్? నా పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా నీళ్లు లేక అల్లాడిన విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తెచ్చినా చర్యల్లేవు.

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? 30 లక్షల మంది నిరుద్యోగుల కంటే నీకు రాజకీయాలు ముఖ్యమా? ఓరుగల్లు పోరుగడ్డపై బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అనూహ్య స్పందన వచ్చింది. అయినా సీఎంకు బుద్ది రాలేదు. అందుకే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ తో ఈనెల 25న పాలమూరు కేంద్రంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నాం. సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్టింగ్ జడ్జిపైనే మాకు నమ్మకం ఉంది. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతున్నాం.

• అట్లాగే పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా ఈనెల 23న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆ పార్లమెంట్ కు సంబంధించి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం.

• బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం పార్టీ నేతలు బీజేపీ చేరడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన కొనసాగుతుందో.. బాన్సువాడలోనూ కుటుంబ పాలన నడుస్తోంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు పాల్గొని ప్రారంభోత్సవాలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అన్నింట్లో కమీషన్లే. గతంలో స్టేషనరీ కుంభకోణంలో అడ్డంగా దొరికి కేబినెట్ నుండి బర్తరఫ్ అయిన వ్యక్తికి రాజ్యాంగ బద్ద పదవులిస్తే ఇట్లనే ఉంటుంది.

• కేంద్ర ప్రభుత్వం రోజ్ గార్ మేళా పేరిట ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2.16 లక్షల ఉద్యోగాను భర్తీ చేసి నియామక పత్రాలను కూడా అందజేశాం. ఎక్కడా చిన్న పొరపాటు జరగలేదు. కానీ తెలంగాణలో మాత్రం అన్నీ స్కాంలే. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందో నిలదీయండి. టీఎస్పీఎస్సీ స్కాంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?

• కోర్ కమిటీ సమావేశంలో అనేక అంశాలను చర్చించాం. కేంద్ర పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, బీజేపీ సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై చర్చించాం. అందరి సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు క్రుషి చేస్తాం.

• (బండి సంజయ్ బూతులు మాట్లాడతారన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై…) నేనెప్పుడైనా బూతులు మాట్లాడానా? నా గురువు కేసీఆరే కదా… నేను బూతులు మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్లే. బూతుల సంగతి తరువాత. అగ్గిపెట్టే సంగతేమైందో ఆ మంత్రి సమాధానం చెప్పాలి. ఆయన నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే.. ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆయన పని.

తరుణ్ చుగ్ మాట్లాడుతూ….

• తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. రాజ్యాంగం లేదు. నయా నిజాం పాలన కొనసాగుతోంది. కేసీఆర్ కుటుంబం రాజ్యాంగం కంటే తామే పెద్ద అని భావిస్తూ పాలన కొనసాగిస్తున్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలంతా భావిస్తున్నారు.

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఆందోళనలో ఉంటే కేసీఆర్ స్పందించడం లేదు. వారి పక్షాన బండి సంజయ్ ఆధ్వర్యంలో కేటీఆర్ ను బర్తరఫ్ చేసే వరకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుంది.

• దేశంలో మోదీ నాయకత్వంలో నీతి వంతమైన పాలన కొనసాగుతుంటే…. కేసీఆర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ, నితీష్ తో కలిసి లంగిడీ(వికలాంగ) సర్కార్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ నవంబర్ లో తెలంగాణలో రిటైర్డ్ (ఓడిపోతున్నారనే భావన) కాబోతున్నారు. తన భవిష్యత్తు కోసం ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేతో చేతులు కలిపి పనిచేస్తున్నారు.

• రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో చేసేదేముంది? అతి త్వరలోనే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవులను వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉండక తప్పదు. కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి ప్రజా తీర్పును వంచించారు. ఆ పార్టీకి నీతి, రీతి లేదు. బీజేపీ పార్టీకి నీతితోపాటు సమర్ధవంతమైన నేత ఉన్నారు. సిద్ధాంతంతోపాటు విజన్ కలిగిన పార్టీ. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా తెలంగాణలోనూ నీతివంతమైన పాలన అందిస్తాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected