వైద్యురాలి నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణి మృతి...
వైద్యురాలి నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణి మృతి...

వైద్యురాలి నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణి మృతి...
వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణం
వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నిండు గర్భిణి ప్రాణాలు పోయాయి. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ మంగళవారం ఉదయం ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జింకల రాజుకు ప్రవళిక (25)తో 2019లో వివాహం జరిగింది. 2020లో ప్రవళిక గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చింది.
మళ్లీ ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చిన ప్రవళిక క్యూర్ వెల్ ఆస్పత్రికి ప్రతినెలా వెళ్తూ వైద్య పరీక్షలు చేయించుకుంటుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించిన సదరు వైద్యురాలు ప్రవళికకు పాప పుట్టిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ఆమె కుటుంబీకులకు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం జరుగుతోందని, రక్తం అవసరం ఉంది తీసుకురావాలని సూచించారు.
అందుకు ప్రవళిక భర్త రాజు, ఆమె సోదరుడు కర్రె ప్రవీణ్ సుమారుగా సాయంత్రం ఆరు గంటల వరకు క్యూర్ వెల్ ఆస్పత్రి సమీపంలోని ఓప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో వేలాది రూపాయలు ఖర్చు చేసి అరుదుగా దొరికే నాలుగు యూనిట్ల ఏ పాజిటివ్ (A+) బ్లడ్ సేకరించి వైద్యులకు అందించారు.
అదే సమయంలో రాజును పిలిచి గర్భసంచి తొలగించి ప్రవళికకు మెరుగైన వైద్యం అందిస్తామని అందుకు, గాను నో అబ్జెక్షన్ పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుందని వైద్యురాలు తెలపడంతో ఆయన సరేనని సంతకం చేశాడు.
సాయంత్రం ఏడు గంటల సమయంలో అంతాబాగానే ఉందని వైద్యులు తెలవడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో ప్రవళిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని తెలిపి ఆమెను మరో ఆస్పత్రికి తరలించాలంటూ ఆక్సిజన్ సిలిండర్తో అంబులెన్స్ ద్వారా నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి వైద్యులు తరలించి, సీపీఆర్ చేస్తున్న క్రమంలో ప్రవళిక మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
మొత్తం ఐదుగంటల పాటు ప్రవళికకు శస్త్రచికిత్స, వైద్యం పేరుతో వైద్యులు నానా హంగామా చేసి మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించి చనిపోయినట్లు చెప్పారని బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మరొక హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతురాలి తమ్ముడు ప్రవీణ్ పరిగెత్తుకుంటూ అంబులెన్స్ వెనకాల వెళ్తూ కాలు జారి పడి పోవడంతో కాలు విరిగింది. దీంతో అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
బాగానే ఉందని చెప్పి మళ్లీ మరో ఆసుపత్రికి తరలించి మరణించింది అని చెబుతున్నారని, కుటుంబ సభ్యులు లేకుండా ఆంబులెన్స్ లో వైద్యులు ఎలా తీసుకెళ్తారని బాధితులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం బాధిత కుటుంబానికి సర్ది చెబుతూ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి వత్తాసు పలకడం గమనార్హం. కాగా దీనిపై ఆస్పత్రి డాక్టర్ రాకేష్ ను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.
జర్నలిస్టులపై ఆస్పత్రి సిబ్బంది దురుసు ప్రవర్తన
ఆస్పత్రిలో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరం కాలం చెల్లినట్లు ఉండగా దానిని ఫొటో తీసి దానిని డాక్టర్ కి తెలియజేసే క్రమంలో ఆస్పత్రి మేనేజర్ సిద్దు అనే ఉద్యోగి వచ్చి మీరు ఎవరు మీకేం అవసరం అంటూ దురుసుగా ప్రవర్తించాడు.
