చిచ్చుపెట్టిన సిగరెట్ పొగ...

చిచ్చుపెట్టిన సిగరెట్ పొగ...
సిగరెట్ పొగతో రేగిన గొడవలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో ఉగాది పండగ సందర్భంగా జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవిచర్లలో ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా గుండబ్రహ్మయ్య జాతర వైభవంగా జరుగుతుంది.
ఈ జాతరకు మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్ర బన్ని(21), తల్లి పూల, సోదరి పూజిత, అన్న ధని అలియాస్ శివ, స్నేహితుడు గిరిబాబుతో కలిసి వచ్చారు. దర్శనం అనంతరం సోదరుడు ధని, తల్లి పూల, సోదరి పూజిత ఇంటికి వెళ్లిపోయారు. బన్ని, గిరిబాబు జాతరలో ఉన్నారు.
రాత్రి 11.30 గంటల సమయంలో బన్ని స్నేహితుడు గుండేటి చందు.. ధనికి ఫోన్ చేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బన్నిని బెదిరిస్తున్నారని సమాచారం ఇచ్చాడు. వెంటనే ధని గవిచర్లకు చేరుకుని విచారించాడు.
దేవాలయానికి కొద్ది దూరంలో బన్ని సిగరెట్ తాగుతుండగా గవిచర్లకు చెందిన వెల్పుల సిద్ధు కాస్త దూరంగా వెళ్లి తాగమన్నాడు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఇరువురు ఘర్షణ పడ్డారు.
ఈ లోగా సిద్ధు అన్న వినయ్.. బన్నితో మాట్లాడి తన సోదరుడు సిద్ధు తప్పుచేశాడని అంగీకరించి అతడి తరఫున క్షమాపణ చెప్పాడు. తర్వాత జాతరలో కొంత సమయం ఉన్నారు. సిద్ధు జరిగిన వాదన గురించి కక్ష పెంచుకున్నాడు.
అంతటితో ఆగకుండా సంగెం మండల కేంద్రానికి చెందిన తన మేనమామ గుండేటి సునీల్‌కు ఫోన్‌లో జరిగిన విషయం చెప్పడంతో 12.15లకు ఆటోలో సునీల్‌తోపాటు గుండేటి రాజు, కార్తీక్ అలియాస్ కర్రి, మహేందర్ అలియాస్ దోని, మెట్టుపల్లి భరత్, ఎం. భరత్, గుండేటి రాజ్‌కుమార్, గుండేటి కొమ్మాలు హుటాహుటిన జాతర ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికి సద్దుమణిగిన గొడవ సంగెం నుంచి వచ్చిన 8 మందితో మరింత ఎక్కువ అయ్యింది.
తన అల్లుడు సిద్ధను ఎందుకు తిట్టారని, ఈ రోజు చంపుతామని బన్నిని కొట్టారు. దీంతో ధని.. బన్ని స్నేహితులతో కలిసి బన్ని రక్షించడానికి యత్నించాడు.
ఈలోగా సునీల్ మిగతా వారితో కలిసి బన్నిపై దాడిచేసి పరారయ్యారు. ఈ దాడిలో బన్ని మెడ నరాలకు తీవ్రంగా గాయమై స్పృహ తప్పిపడిపోయాడు.
గమనించిన స్థానికులు ముందు ఫిట్స్ అని చేతులు కాళ్లు మర్దన చేశారు. గమనించిన కానిస్టేబుల్ గుండెపోటు అని సీపీఆర్ చేశారు. అనంతరం 108లో ఎంజీఎం తరలించగా వైద్యులు పరీక్షించి బన్ని మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై మృతుడి సోదరుడు ధని అలియాస్ శివ ఫిర్యాదు మేరకు నిందితులు 9మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, బన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం కుంటపల్లికి తరలించారు. సంగెం, ఐనవోలు ఎస్సైలు నరేశ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బన్ని అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాగా, బన్ని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటూనే ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బన్ని తండ్రి రాజు పది సంవత్సరాల క్రితం మృతి చెందాడు.
