పట్టాలు మంజూరు చేశాక భూముల జోలికెళ్ళొద్దు:- తెలంగాణ హైకోర్టు
సాగు భూముల్లో అడుగు కూడా పెట్టలేదన్న ప్రభుత్వ న్యాయవాది
ఏం చేయకుండానే రైతులు ఇక్కడిదాకా వచ్చారా?:- ప్రశ్నించిన హైకోర్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (సి.కే న్యూస్) డిసెంబర్ 17:
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదనే చందంగా తయారైంది దుమ్ముగూడెం మండలానికి చెందిన పోడు రైతుల పరిస్థితి. పట్టాలు వచ్చాయన్న రైతుల ఆనందం ఆవిరయ్యేలా ప్రవర్తిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. దుమ్ముగూడెం మండలం గౌరవరం గ్రామానికి చెందిన బుద్దుల దూలయ్య మడకం ముత్తయ్య బుద్దుల సీతమ్మ అనే రైతులకు పోడు భూములు ఉన్నాయి. వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల పట్టాలు కూడా మంజూరు చేసింది.
అయితే కొంత మేరకే పట్టాలు పొందామని మరికొంత విస్తీర్ణం గల సాగు భూమికి కూడా పట్టాలు పంపిణీ చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. కానీ రైతులు లేని సమయంలో రైతులకు తెలియకుండా అటవీ అధికారులు సాగు భూములలోకి పొక్లైన్ తో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా వేలకు వేలు ఖర్చు చేసి రైతులు వేసుకున్న పత్తి పంటను నాశనం చేస్తూ చేను మధ్య నుండి ట్రెంచ్ కొట్టారు.
కష్టపడి సాగు చేస్తున్న పత్తి చేలు ధ్వంసమైన విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ అటవీ అధికారుల దగ్గరికి వెళ్లి అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రైతులకు సరైన సమాధానం కూడా చెప్పకుండా మమ్మల్నే ప్రశ్నిస్తారా అని గ్రామం మొత్తం రీసర్వే చేసి భూములు లాక్కుంటామంటూ అమాయకులైన రైతులపై బెదిరింపులకు దిగారు. దీంతో విధిలేక తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆమాయకులైన ఆదివాసీ రైతులు.
శనివారం ఈ కేసును స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అటవీ శాఖ తరఫున ప్రభుత్వ ప్లీడరు వాదనలు వినిపిస్తూ పట్టా భూముల్లోకి గానీ ఆదివాసీ రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న సాగు భూముల్లోకి గానీ అటవీ శాఖ అధికారులు అడుగు పెట్టలేదని కోర్టుకు తెలియజేశారు.
అయితే తెలంగాణ హైకోర్టు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దుమ్ముగూడెం మండలంలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన ప్రాంత రైతులపై అటవీ శాఖ అధికారుల చర్యలు ఇలాగే ఉన్నాయని వ్యాఖ్యానించింది.
అటవీ శాఖ అధికారుల వేధింపులు భరించలేకే నిరుపేద గిరిజన రైతులు కోర్టు ఖర్చులు భరించి హైకోర్టు దాకా వచ్చారని… అధికారులు ఇబ్బంది పెట్టకుండానే రైతులు హైకోర్టుదాకా వచ్చారా అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇకపై గిరిజనులకు పట్టాలు ఇచ్చిన వ్యవసాయ భూముల్లోకి అధికారులెవరూ అడుగు పెట్టొద్దని ప్రాథమిక ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.
తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని వేధిస్తున్నారు:- బాధిత రైతులు
ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తున్నా లెక్కచేయకుండా అటవీ శాఖ అధికారులు మాత్రం గిరిజనులను వేధించడం మానడంలేదు.
బాధిత రైతులను పిలిపించి పట్టా పుస్తకాలు ఇవ్వండని, తెల్ల కాగితాల్లో సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారు. అసలు తెల్ల కాగితాలపై ఎందుకు సంతకాలు చేయాలనే రైతుల ప్రశ్నకు అటవీ శాఖ అధికారులు సమాధానం చెప్పలేదు.
గ్రామ స్థాయి అటవీ హక్కుల కమిటీ సభ్యులను కూడా అధికారులు తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. పోడు రైతులకు అండగా నిలవాల్సిన గ్రామ కమిటీ సభ్యులు అటవీ శాఖ అధికారుల చేతిలో కీలు బొమ్మలుగా మారి సాటి రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేయడం గమనార్హం.
కోర్టుకు వెళ్లిన రైతులపై వేధింపులు ఎలా ఉన్నాయంటే డిఎఫ్ఓ, డిఆర్.ఓ, ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్లతో పాటు స్థానిక గ్రామ సర్పంచి ఎంపిపి మరియు గ్రామ అటవీ హక్కుల కమిటీ సభ్యులందరూ ఏకమై హై కోర్టును ఆశ్రయించిన రైతులపై తీవ్ర స్థాయిలో వేధింపులకు దిగుతున్నారు. బాధిత రైతులు గనుక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అధికారుల వేధింపులు గురించి ప్రస్తావిస్తే వీరందరిపై కఠిన చర్యలు తప్పవేమో.
ఇప్పటికే హైకోర్టు పోడు రైతులకు అనుకూలంగా నిర్ణయం వెలువరించిన నేపథ్యంలో తుది తీర్పు వచ్చేలోపు రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే గనుక జరిగితే అధికారులతో పాటు వారికి సహకరిస్తూ రైతులను వేధిస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు.