కోమటిరెడ్డి నుంచి ఊహించని పాట.. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఖుషీ
డిసెంబరు 30న ..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను కోమటిరెడ్డి ట్వీట్ చేశారు. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామని క్యాప్షన్ పెట్టారు.
ఈ ట్వీట్‌కు అర్థమేంటని? నెటిజెన్లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తెగ ఆలోచించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేకుండా.. భట్టితో కలిసి కొత్త శకాన్ని ఎలా నిర్మిస్తారని.. దీని వెనక ఏదో ఉద్దేశ్యముందని కొందరు ప్రశ్నలు లేవెనెత్తారు.
ఇద్దరు కలిసి పెద్ద ప్లానే వేశారని.. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా? ఉన్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఐతే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ.. మరో వీడియోను పోస్ట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
సలార్(Salaar)లోని సూపర్ హిట్ ఎమోషన్ సాంగ్.. ‘సూరీడే..’. పాటను పోస్ట్ చేశారు. తన ఫొటోలు, రేవంత్ రెడ్డి ఫొటోలతో ”కంచె ఒకడైతే.. అది మించెవాడొకడే” అంటూ వీడియోను రూపొందించారు. తామిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. ఇద్దరం మంచి మిత్రులమని అర్థమొచ్చేలా ఆ ట్వీట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్‌తో సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు ఖుషీ అయ్యారు. విభేదాలను పక్కనబెట్టి.. మీరంతా ఇలానే కలిసి ఉండాలని కోరుతున్నారు. నేతలు ఐక్యమత్యంగా ఉంటే అది పార్టీకే కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందని అభిప్రాయడుతున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో సీనియర్లను ముందు నుంచీ పొసగడం లేదనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి.. తమపై పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చాలా సార్లు అన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రం అందరూ కలిసి కట్టుగా పనిచేయడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత సీఎం పదవి కోసం కూడా.. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేశారు.
కానీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో.. సీనియర్లెవరూ అంతగా అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అందరూ కలిసిపోయి.. ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించారు.