
కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్..!
ఉమ్మడి జిల్లాలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉద్యోగాలు..!
నిర్మల్ జిల్లాలో పలువురికి కారుణ్య నియామకాల పోస్టుల భర్తీ.!
త్వరలోనే మిగతా జిల్లాల్లో..!
నిర్మల్: ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ఊరటను ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కారుణ్య నియామకాల పేరుతో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు తాజాగా ప్రభుత్వ ఉద్యోగ పోస్టింగ్ లు ఇస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్యలు తీసుకుంటున్నారు.
గత మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన కారుణ్య నియామకాల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన కారుణ్య నియామకాల ప్రక్రియకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాలో 20 మందికి పోస్టింగ్..!
నిర్మల్ జిల్లాలో కారుణ్య నియామకాల ద్వారా అర్హత ఉన్న పలు పోస్టులు భర్తీ చేసినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష వెల్లడించారు.
జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 29 కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రస్తుతం 20 మంది నియామకాలను పూర్తి చేసినట్లు వివరించారు. ఈ 20 పోస్టులలో.. 13 మందికి జూనియర్ అసిస్టెంట్, 6 ఆఫీస్ సబార్డినేట్, 1 కామాటి పోస్టును భర్తీ చేశామన్నారు. వీరిని వివిధ శాఖలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
మిగతా 9 పోస్టులు రోస్టర్ అంశాలతో ముడిపడి ఉన్నందున ఆ పోస్టులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కారుణ్య నియామకాలు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, కౌన్సిలింగ్ నిర్వహించి, పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.
త్వరలోనే మిగతా జిల్లాల్లో..!
ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కారుణ్య నియామకాలను త్వరలోనే చేపట్టేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు కారుణ్య నియామకాల కింద అర్హులైన వారి జాబితాలను వెంటనే పంపాలని అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
దీని ప్రకారం మంచిర్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ త్వరలోనే కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులను కోల్పోయి కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.




