రేవంత్ దూకుడుతో వ్యూహాం మార్చిన BRS.. ఇక రంగంలోకి గులాబీ బాస్ ఎంట్రీ..!
తెలంగాణలో ప్రభుత్వ పగ్గాలు చేతులు మారి నెల రోజులు అవుతోంది. ఈ 30 రోజుల్లో ప్రభుత్వంలో కుదురుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది.
అలాగే రాజకీయంగా బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు అవసరమైన అన్ని రకాల వ్యూహాలకు అధికార పక్షం పదును పెట్టింది. గత ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచుతూ గులాబీ నేతల తీరును ఎండగడుతూ వస్తోంది.
ఇంతటితో ఆగకుండా త్వరలోనే మరిన్ని అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకాన్ని బయటపెడతామని తెగేసి చెబుతోంది. దీంతో అధికార పక్షం స్పీడ్‌కు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వడంలో పూర్తిగా విఫలం అవుతున్నారనే టాక్ బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలకు ముంగిట్లో కాంగ్రెస్ జోరు ఆపకుంటే మొదటికే మోసం తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ అధినేత ఇక తానే రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్వయంగా రంగంలోకి కేసీఆర్:
హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ త్వరలోనే ప్రజల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. ప్రజా తీర్పుపై కొంత మంది ముఖ్య నేతలతో మినహా క్యాడర్‌కు ఎటువంటి సందేశం ఇవ్వలేదు.
ఇంతలో అనూహ్యంగా ఆసుపత్రి పాలు కావడం ఆ తర్వాత విశ్రాంతితో ఆయనకు ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే చర్చ జోరందుకుంది. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేస్తుంటే మరోవైపు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన బీఆర్ఎస్‌లో మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరు బహిర్గంతం అవుతుంది.
ఇదే సమయంలో కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి రోజు రోజుకు డోస్ పెంచే నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న విద్యుత్, కాళేశ్వరం, ఆర్థిక ప్రగతి అంశాలలోని వైఫల్యాలపై ఫోకస్ పెట్టింది.
పరిపాలనలో అనుభవం లేని రేవంత్ రెడ్డిని ఏకీపారేస్తారని భావించిన కేటీఆర్, హరీష్ రావులు అధికారపక్షం వ్యూహాలను పసిగట్టలేక రోజురోజుకు డిపెన్స్‌లో పడిపోతున్నారనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని గ్రహించిన గులాబీ బాస్ ఇక స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ వస్తేనే భరోసాగా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తుండగా.. ఈ మేరకు త్వరలో కేసీఆర్ జిల్లా పర్యటనలు చేయబోతున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. అయితే కేసీఆర్ నిర్ణయం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కొత్త ప్రభుత్వానికి ఆర్నెళ్లు టైమ్ ఇద్దామని గతంలో చెప్పిన కేసీఆర్ మౌనంగా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బైపోతామని అందువల్లే నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేయాలని హరీష్ రావు, కేటీఆర్‌లకు ఆదేశించారని అయితే వారి విమర్శలు సెల్ఫ్ గోల్‌గా మారుతుండటంతో ఇక తానే రంగంలోకి దిగాలనే అభిప్రాయానికి వచ్చారనే టాక్ వినిపిస్తోంది.
కేసీఆర్‌లో మార్పు!:
తెలంగాణ భవన్‌లో శనివారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు అప్ డేట్ ఇచ్చారు. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారని చెప్పారు.
ఇకపై తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ప్రతిరోజూ కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు. అన్ని సజావుగా జరిగితే జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన ప్రజల వద్దకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇకపై కేసీఆర్ ప్రతిరోజు కార్యకర్తలకు సమయం కేటాయించబోతున్నట్లు హరీష్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అధికారం కోల్పోయాక కేసీఆర్‌లో మార్పు చూడబోతున్నామా అనే చర్చ పొలిటికల్ కారిడార్‌లో వినిపిస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులతో పాటు ఉద్యమకారులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదనేదేది కేసీఆర్ పై ఉన్న ప్రధాన విమర్శ. అత్యంత సన్నిహితులనుకున్న వారిని సైతం కేసీఆర్ తన పదవీకాలంలో దూరం పెట్టి అహంకారంతో దొర మాదిరిగా కేసీఆర్ వ్యవహరించారనే టాక్ ఉంది.
అంటువంటి కేసీఆర్ ఇకపై ప్రతిరోజు క్యాడర్ తో కలవాలని నిర్ణయించుకోవడం వెనుక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేసీఆర్ లో మార్పు తీసుకురాబోతున్నదా అనే చర్చ మొదలవుతోంది.