పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మిన కన్న తండ్రి, రాత్రికి రాత్రే పట్టేసిన పోలీసులు
డబ్బుపైన ఆశతో కన్న బిడ్డలనే కిడ్నాప్ చేసి ఓ తండ్రి అమ్మకానికి పెట్టాడు. భార్య ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల విషయం బయటికి వచ్చింది.
వెంటనే పోలీసులు సకాలంలో స్పందించి అతణ్ని పట్టుకోవడంతో నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇలా కన్న బిడ్డలనే అమ్మాకానికి పెట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని గౌరీ శంకర్ అనే కాలనీలో రఫీ కుటుంబం నివాసం ఉంటోంది. రఫీ కొంత కాలంగా తాగుడు, జూదానికి బానిస అయ్యాడు.
కొద్ది నెలలుగా గోవా పర్యటనలు చేస్తూ అక్కడ ఫూటుగా తాగుతూ జల్సాలకు అలవాటయ్యాడు. ఇతనికి హబీబున్నిసాతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు మగపిల్లల సంతానంగా ఉన్నారు.
ఇతను తరచు గోవా వెళుతూ అక్కడ అనేక చెడు వ్యసనాలకు బానిస అవడంతో పాటు ఇంకో వివాహం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తరచూ భార్యతో గొడవపడే వాడని తెలిపారు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తన పిల్లలకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పిన తండ్రి రఫీక్ తన పిల్లలు రుమానా బేగం (6) రమీజ్ (3) షోయబ్ (1.5) సంవత్సరాల చిన్నారులను తన బైక్ పైన ఎక్కించుకొని మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు.
రాత్రి గడిచినా వారు వెనక్కి రాకపోవడంతో భార్య హబీబున్నిస కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు నిందితుడు రఫిక్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు.
హైదరాబాద్ లోని యాకుత్పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. రఫీ వద్ద ముగ్గురు పిల్లలు లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ఆరా తీశారు.
దీంతో తాను పిల్లల్ని మరో వ్యక్తి వద్ద ఉంచానని చెప్పడంతో అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. ఓ వ్యక్తి వద్ద కారులో ముగ్గురు పిల్లలు ఉండడాన్ని గుర్తించారు.
పిల్లలు అక్కడ ఎందుకు ఉన్నారని పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నించగా.. రఫీక్ తనకు 9 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. అప్పటి వరకూ ఆ ముగ్గురు పిల్లలను తన వద్ద ఉంచుకోమని చెప్పారని వివరించారు.
పోలీసులు పిల్లల్ని అర్ధరాత్రి క్షేమంగా పిల్లలను తల్లి వద్దకు చేర్చారు. సోమవారం ఉదయం పిల్లలను అమ్మకానికి పెట్టిన రఫిక్ ను కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు.
తన ముగ్గురు పిల్లలను రూ.9 లక్షలకు అమ్మకానికి పెట్టాడని రఫిక్ కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన జడ్చర్ల పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.