ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎవరో గుర్తు తెలియని వారు 15 రోజుల ఆడ శిశువుని మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ప్రభుత్వ ఉయ్యాలలో వదిలేసి వెళ్లారని ఆసుపత్రి ఆర్ఎంఓ డా. రాంబాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం తెలుసుకున్న జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి విష్ణువందన, డిసిపిఓ చైల్డ్ కేర్ సిబ్బంది యశోద, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంధ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుధ భవాని లు ఆసుపత్రికి వెళ్లి పాపని చూడడం జరిగింది.
పాప ఆరోగ్యంగా ఉన్న విషయం, వైద్యాధికారి డా. ప్రత్యూష నుండి తెలుసుకొని, పాప యొక్క వివరాలు తెలియడం కోసం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పాప వివరాలు తెలియాల్సి వుంది. ఖమ్మం టూ టౌన్ పోలీస్ వారు పాపని సంరక్షణ నిమిత్తం ఐసిపీఎస్ వారికి అప్పగించడం జరిగింది. పాప ని చైల్డ్ వెల్ ఫెర్ కమిటీ ఆదేశాల ప్రకారం శిశు గృహలో ఉంచడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి సుమ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉయ్యాల ఉంటుందని, పిల్లలు వద్దనుకున్న వారు బయట చెత్తకుప్పలలో, మరెక్కడా పడేయకుండా, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులకి నేరుగా అప్పగించవచ్చని, లేదా ఉయ్యాలలో పెట్టి వెళ్ళవచ్చని తెలిపారు.
శిశు గృహ లో ఉన్న పిల్లల్ని చట్ట ప్రకారం దత్తత కి ఇవ్వనున్నట్లు ఆమె అన్నారు. పిల్లలు దత్తత కావాలనుకున్న వారు, ఖమ్మం ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు కాని, ఆన్లైన్ https://cara.wcd.gov.in and https://carings.wcd.gov.in వెబ్సైట్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలని ఆమె అన్నారు.
దత్తత జేజే యాక్ట్-2015 (Juvenile Justice (Care and Protection of Children) Act, 2015) ప్రకారం చట్టపరంగా తీసుకోవాలని, చట్ట విరుద్ధంగా దత్తత తీసుకుంటే జేజే యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జిల్లా సంక్షేమ అధికారిణి అన్నారు