ఖమ్మంలో మళ్లీ కన్స్ట్రక్షన్ .. అండగా ఉన్న అక్రమార్కులెవరు..?
అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమమా..?
సికె న్యూస్ ఖమ్మం : సామాన్యులు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే అనేక నిబంధనలు పాటించాలి. అనుగుణంగా కావాల్సిన పత్రాలు జత చేసి అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అనుమతులు వచ్చాక వాటికి అనుగుణంగా మాత్రమే ఏదేనా నిర్మాణం చేపట్టాలి.
ఎలాంటి డీవియేషన్ జరిగినా సంబంధిత అధికారులు నోటీసులు జారీచేయడం, నిబంధనల మేరకు వాటిని కూల్చివేయడం సహజం. కానీ అనుమతులు పూర్తిగా లేకున్నా.. ఉన్న అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు లేకున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ప్రధాన రహదారిపైనే బహుళ అంతస్తులతో కూడిన నిర్మాణం జరుగుతున్నా ఏ ఒక్క అధికారికి చలనం లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం వద్ద..
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద నగరంలోని పేరున్న వైద్యశాల నిర్వాహకురాలు ఒకరు రెండేళ్ల క్రితం ఈ భవన నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం కార్నర్ పాయింట్ కావడం.. ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతం కావడం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నా నాటి అధికారులు పట్టించుకోలేదు.
అప్పటికే ఐదు అంతస్థుల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. సెట్ బ్యాక్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని, ఈ నిర్మాణం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మా దృష్టికి తీసుకురాగా పత్రికలలో కథనాలు ప్రచురితమయ్యాయి. నాటి కథనాల ఆధారంగా పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉందని స్పష్టం చేసిన పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీచేశారు.
పనులను నిలిపివేశారు. కొంతభాగాన్ని దగ్గరుండి మరీ కూల్చివేయించారు. నోటీసు ప్రతులను అడిషనల్ కలెక్టర్, సుడా చైర్మన్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, పంచాయతీ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులకు పంపించారు.
అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమమా..?
సంవత్సరం క్రితం భవంతి నిర్మాణం అక్రమమని, సెట్ బ్యాక్ లు పూర్తిగా ఆక్రమించుకుని నిర్మాణం చేస్తున్నారని అధికారులు నోటీసులు జారీ చేసి నిర్మాణం నిలిపివేసిన భవనం.. ఇప్పుడు ఎలా సక్రమంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్వయంగా కమిషనర్ సైతం స్పందించి నిర్మాణం అక్రమమని తేల్చి ఆపినా.. మళ్లీ పనులు జరుగుతుండటం స్లాబులు ఇంకా పెరగడం విస్మయం కలిగిస్తున్నది. ఈ నిర్మాణం బహిరంగంగానే సాగుతున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలను కలిగిస్తుంది.
సుడా నిబంధనల ప్రకారం 350 గజాలు దాటితే సుడా అధికారులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కమర్షియల్ భవనాలు నిర్మించేటప్పుడు పక్కాగా నిబంధనలు పాటించాల్సిందేనని అనుమతి పత్రంలో పొందుపరిచి మరీ ప్రొసిడింగ్ ఇస్తారు.
కానీ రూరల్ మండలం ఏదులాపురం బైపాస్ పక్కనే బహుళ అంతస్తు నిర్మాణానికి మాత్రం అటువంటి నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్నా అధికారులు నిమ్మకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మూలమలుపు వద్దనే భవనం నిర్మిస్తుండటం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
సుడా అధికారులకు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత అధికారులు క్షేత్రస్తాయి పరిశీలన చేసిన తరువాతనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించకుండా 20అడుగులు కలుపుకుని మరి నిర్మాణం జరుపుతుండటం విశేషం.
రహదారి విస్తరణ పనులకు తీవ్ర ఆటంకం.. ప్రస్తుతం నిర్మించే భవనం ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారి పక్కనే కావడం.. ప్రస్తుతం ఈ రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో భవంతి అడ్డంకిగా మారింది. విస్తరణ చేసే మార్కు ప్రకారం చూస్తే భవంతి అడ్డంగానే ఉంది.
భవనానికి దాదాపు 50 మీటర్ల దూరం వరకు విస్తరణ పనులు పూర్తికాగా.. ఈ ప్రాంతంలో విస్తరణ పరిస్థితి ఏంటి? ఎలా జరుగుతుందన్నది సస్పెన్స్ గా మారింది. ఓ వైపు విస్తరణ పనులు సాగుతుండగా.. ఈ భవన నిర్మాణ పనులు కూడా యథేచ్ఛగా కొనసాగడం కొసమెరుపు.
రోడ్డు విస్తరణ అలైన్ మెంట్ మారుస్తారా? లేదా అక్రమంగా నిర్మిస్తున్న భవన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారా? డివియేషన్ అయినా భాగాన్ని కూల్చివేసి రహదారి విస్తరణకు ఇబ్బందులు లేకుండా చూస్తారా? వేచిచూడాలి.