ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో పట్టుసాధిస్తున్న రేవంత్ రెడ్డి
ఆయన నిర్ణయమే శిరోధార్యం దారికి వస్తున్న సీనియర్లు
గతంలో ఎగిరిపడిన నేతలే నేడు ప్రశంసల జల్లు
రేవంత్ కు ఏఐసీసీ పెద్దల మద్దతు ముఖ్యంగా యువనేత రాహుల్ అండ
హైదరాబాద్:
ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు భిగిస్తున్నారు. ఇక పార్టీలో ఆయన నిర్ణయమే శిరోధార్యంగా కొనసాగుతున్నది. గతంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం అయిన తర్వాత ఆయనపై ఒంటికాలితో లేచి ఆరోపణలు గుప్పించిన సీనియర్ నేతలు రేవంత్ పాలనపై ప్రశంసలు గుప్పించడంతోనే ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఏ మేరకు పట్టుసాధించారో ఇట్టే అర్థం అవుతుంది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను మోకాలడ్డిన కొంత మంది సీనియర్ నేతలు ప్రస్తుతం రేవంత్ జపంలో మునిగిపోయారు.
పార్టీ పట్టిష్టం కోసం, అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలిచేందుకు రేవంత్ చేసిన కార్యక్రమాలు, పనులపై బహిరంగంగా మీడీయా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి, అదును దొరికినప్పుడల్లా రేవంత్ పై అక్కసు వెళ్లగక్కిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తడం ఇటు పార్టీలో, అటు ప్రజల్లో చర్చ కొనసాగుతున్నది. చిన్న వయస్సులోనే పెద్ద పదవిని అధిష్టించిన రేవంత్ రేడ్డి ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సిన బాధ్యత ఉంది.
ఈ బాధ్యతను గ్రహించి ఆయన అందరితో కలిసిపోతూ మరో పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నాన్ని పార్టీలోని పెద్ద నేతలతో పాటు మంత్రులు సైతం అభినందిస్తుండడం గమనార్హం.
ప్రశంసలకు కారణం ఏంటీ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోస్త్ మేరా దోస్త్ అంటూ సీనియర్ మంత్రులతో పాటు పార్టీలోని పెద్ద పెద్ద నేతలు సైతం ఇటీవల ప్రశంసలు గుప్పిస్తున్నారు. బుధవారంనాడు రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కోస్గిలో దాదాపుగా రూ. 4400 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంఖుస్థాపనలు చేశారు.
ఈ సమావేశానికి వచ్చిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రశంసల జల్లుకురిపించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అలాగే ప్రజల్లో చర్చకొనసాగుతున్నది. ఇందుకు కారణం ఏంటి..? అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకప్పుడు రేవంత్ అంటేనే అంతెత్తున ఎగిరిపడే ఆ నేతలు.. ఇప్పుడు అదే రేవంత్‌పై పొగడ్తలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం పాడుతున్నారు. ఇంతకీ ఆ నేతలు దారికొచ్చారా? లేక రేవంతే దారికి తెచ్చుకున్నారా?.. అనేది చర్చనీయాంశంగా మారింది.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో కాకలు తిరిగిన నేతలు. మా రక్తం కాంగ్రెస్, మా ప్రాణం కాంగ్రెస్ అంటూ.. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తూ.. ఎన్నో కీలక పదవులు చేపట్టారు.
అయితే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అంటే ఈ ఇద్దరు నేతలకు అస్సలు పడేది కాదు. సందు దొరికిందంటే.. వాగ్బాణాలు సంధించేవారు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వరం మారింది.
ఒకప్పుడు గరం గరంగా ఉన్న ఆ నేతలు.. ఇప్పుడు స్నేహగీతం అందుకున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ రేవంత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్‌దే కీలక పాత్ర అంటూ పొగడ్తలతో ఉత్తమ్ ముంచెత్తారు. వీరితో పాటు పార్టీలోని నేతలంతా రేవంత్ రెడ్డి మాటే శిరోధార్యం అనే స్థాయికి చేరింది.
రేవంత్ కు మోకాలడ్డిన జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ప్రతీ అంశంలో రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ మోకాలడ్డిన జగ్గారెడ్డి సైతం రేవంత్ రెడ్డి కి జై కొట్టేస్తున్నారు.
రేవంత్ రెడ్డి పై బహిరంగంగా విమర్శలు చేసి పార్టీ కార్యకర్తల కన్నెర్రకు గురైన జగ్గారెడ్డి నిత్యం రేవంత్ రెడ్డి జపం చేస్తుండడం గమనార్హం. ఓ దశలో రేవంత్ రెడ్డి ముందుకు సాగకుండా ఆరోపణలు చేసిన జగ్గారెడ్డికి అధిష్టాన వర్గం గట్టి హెచ్చరికలు సైతం చేసిన విషయం తెలిసిందే!.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఒంటికాలితో ప్రచారం నిర్వహించడం, పార్టీ నేతలను, కార్యకర్తలను ఎన్నికల్లో అంతా తానై పోరాడి కాంగ్రెస్ ను అధికారంలోకి రేవంత్ రెడ్డి తీసుకొచ్చరన్నది సత్యం.
అలాంటి నేతలపై విమర్శలు చేస్తే ఇక పార్టీలో, ప్రభుత్వంలో పుట్టగతులుండవని గ్రహించిన నేతలు రేవంత్ రెడ్డి బాటలో నడవాల్సిందేనన్న నిర్ణయం తీసుకొని ఆయనకు జై కొడుతున్నట్లు పార్టీలో విస్తృతంగా చర్చకొనసాగుతోంది. ఏదీ ఏమైనప్పటికి పవర్ విలువ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు!.