కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతాం!
సికె న్యూస్ ప్రతినిధి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు బండ్రు శోభా రాణి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ నేతలందరూ ఆసుపత్రిలో చూపించుకోవాలని దుయ్యబట్టారు. లంకె బిందెల్లాంటి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ఖజానాని హరీష్ రావు ఖాళీ చేశారని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకి విముక్తి లభించిందని పేర్కొన్నారు. ఆస్తుల చిట్టాని కేసీఆర్ కుటుంబం బయటపెట్టాలని కోరారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతామని ఆమె హెచ్చరించారు.
ఇదిలావుండగా.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కేటీఆర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటించి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి కనీసం 30 సీట్లు కూడా వచ్చేవి కావని కుండబద్దలు కొట్టారు. అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదని, అతని పాత బుద్ధులన్నీ మెల్లగా బయటకు వస్తున్నాయని విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తామని స్వయంగా కాంగ్రెస్ వాళ్లే ఊహించలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిలో రోషం పొడుచుకుని వస్తోందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే, తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో.. కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.