క్రైస్తవులకు అండగా నిలుస్తాం….
మెదక్ చర్చిని సందర్శిస్తా…
క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సమాజంలో శాంతి, ప్రేమ సందేశాలను పంచే క్రైస్తవులకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. చర్చిల ఆస్తుల ఆక్రమణ సహా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు ముఖ్యమంత్రికి వివరించారు.
స్పందించిన ముఖ్యమంత్రి చర్చిల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, కొత్త చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవుల శ్మశాన వాటికలకు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. మెదక్ చర్చిని సందర్శించాలని చర్చి ప్రతినిధులు కోరగా అందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుని హోదాలో ఎన్నికలకు ముందు మెదక్ చర్చిని సందర్శించానని, తప్పకుండా మరోసారి మెదక్ చర్చిని సందర్శిస్తానని తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్‌లో క్రైస్తవ మత పెద్దలతో పలు అంశాలపై చర్చించానని, ఎంపీగా ఎన్నికైన తర్వాత క్రిస్మస్ సహా పలు వేడుకల్లో పాల్గొన్నానని, వారితో సమావేశమయ్యానని గుర్తు చేశారు. అందరి సహకారంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, తమ ప్రభుత్వంలో మతపరమైన స్వేచ్ఛ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
దేశంలో భయానక పరిస్థితులు….
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భయానక పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అల్లర్లు, ఘర్షణలు జరిగితే పాలకులు అణిచివేసేవారని, కానీ పాలకులుగా ఉన్నవారే ఘర్షణలకు కారణమవుతున్నారంటూ మణిపూర్, గుజరాత్ ఘటనలను ముఖ్యమంత్రి ఉదాహారించారు. ఇది దేశ శ్రేయస్సుకు మంచిది కాదని, అంతా పరమత సహనం పాటించాలన్నారు.
రాహుల్ గాంధీ కావాలనుకుంటే యూపీఏ పదేళ్ల కాలంలోనే ప్రధానమంత్రి అయ్యేవారని, కానీ ఏనాడూ ఆయన పదవిని ప్రేమించలేదని, ప్రజలను ప్రేమించడం, ప్రజలందరిని కలిపి ఉంచడమే ఆయన లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టారని, తర్వాత మణిపూర్ నుంచి గుజరాత్‌కు రెండో విడత యాత్ర ప్రారంభించారని తెలిపారు.
ఘర్షణలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌కు ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి వెళ్లలేదని, రాహుల్ గాంధీ వెళ్లడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఘర్షణలను నిరోధించాయన్నారు. తెలంగాణలో లౌకిక ప్రభుత్వం ఏర్పడిందని, కేంద్రంలోనూ లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సహకరించాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మోదీకి మద్దతుగా కేసీఆర్….
జాతీయ స్థాయి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఔచిత్యం లేదని, ప్రాంతీయ పార్టీలు గెలుచుకునే సీట్లన్ని నరేంద్ర మోదీకి ఉపయోగపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ 2014లో 11, 2019లో 9 ఎంపీ సీట్లు గెలిచారని, నరేంద్ర మోదీ తెచ్చిన 370 రద్దు, జీఎస్టీ, నోట్ల ఉపసంహరణ, రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రతి దశలోనూ కేసీఆర్ మోదీకి మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వవద్దన్నారు. జాతీయ స్థాయిలో లౌకిక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.