కేటీఆర్‌కు అస్వస్థత.. కరీంనగర్ ‘కదన భేరి’ సభకి దూరం
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీల కంటే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల విషయంలో త్వరగా మేల్కొంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొక్కబోర్లాపడ్డ బీఆర్ఎస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది.
ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడంతోపాటు మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నల్గొండ జిల్లాలో తొలి బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో కదనభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి కేటీఆర్ దూరంగా ఉన్నారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ ఈ సభకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో కరీనంగర్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే నల్గొండలో నీటి సమస్యపై బహిరంగ సభ నిర్వహించిన బీఆర్ఎస్ ఆ సభ సక్సెస్ కావడంతో అంతే రెట్టింపు ఉత్సాహంతో కరీనంగర్‌ల ఈనెల 12న భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది.
ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర అనారోగ్యంతో కేటీఆర్ దూరం
మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు.
ఈక్రమంలోనే కరీంనగర్‌లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు.
కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ.. స్వయంగా పర్యవేక్షించిన కేసీఆర్ తీరా బహిరంగ సభకు దూరంగా ఉండటం ఆ పార్టీ నేతల్లో నిరాశ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలుపొంది పార్టీలో పూర్వవైభవం తీసుకురావాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూసుకెళ్లిపోతున్నారు. విశ్రాంతి లేకుండా వరుసగా పర్యటిస్తుండటంతో కేటీఆర్ జ్వరం బారినపడ్డారు.