గురుకుల పోస్టుల భర్తీ పై లేటెస్ట్ అప్డేట్స్
గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌లు లేకుండా చూస్తామని, అందుకోసం బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు తెలిపారు.
ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో ఆదివారం ప్రత్యేకంగా కలిశామని 1:2 జాబితాలో ఎంపికైన వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు శ్రీనివాస్, ఎంటీ రాజు, జయశంకర్‌గౌడ్, సైదులు, వెంకటేశ్, రమేశ్, సంతోష్, సౌజన్య తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రిబ్ చేపట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకుల పోస్టుల భర్తీలోని సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
గురుకుల పోస్టులను ట్రిబ్ ఇటీవల భర్తీ చేయగా, డీసెండింగ్ ఆర్డర్‌లో నియామకాలు చేపట్టలేదు. అంటే తొలుత డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకపోవడమే గాకుండా, వెయింటింగ్ జాబితా కూడా లేదని ట్రిబ్ స్పష్టం చేసింది.
దీంతో ఇప్పటికే నింపిన దాదాపు 8,700 పోస్టుల్లో దాదాపు సగం మేరకు మళ్లీ ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఏ ఒక పోస్టు కూడా బ్యాక్‌లాగ్ లేకుండా భర్తీ చేయాలని, ఆ దిశగా అధికారులను ఆదేశించాలని సీఎంను కోరామని, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు ఆ ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.