పువ్వాడ ఉదయ నగర్ సర్వే నెంబర్ 192 లో భూదందాలు
ఇందిరమ్మ ఇళ్లలో కూడా మాయ
2009లో జారీ చేసిన పట్టా , ప్లాట్ నెంబర్ 253
2017 లో ఇదే నెంబర్ తో మరో పట్టా జారీ
జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై నిజ నిర్ధారణ కమిటీని వేయాలి
గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో పువ్వాడ ఉదయ నగర్ 192 సర్వే నెంబర్ లో అనేక భూదందాలు కొనసాగిన విషయమై అనేక కథనాలు వెలుగు చూస్తున్నప్పటికీ , ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మక పధకం ఇందిరమ్మ కింద జారీ చేసిన ఇళ్ల విషయంలో కూడా బీఆర్ఎస్ హయాంలో మాయ చేశారని ఆరోపించారు .
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీలు ఇచ్చిన విధంగా అనేక భూ అక్రమాలపై నిస్పక్షపాత విచారణ నిర్వహించి , దోషులకు శిక్షిస్తామని , ఆ భూములను స్వాధీనం చేసుకొని , నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు . ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా జిల్లా కేంద్రం , జిల్లా కేంద్రం చుట్టుపక్కల జరిగిన భూభాగోతంపై అనుకున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం , అధికారులు వేగంగా కదలడం లేదనే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండదండలతో ఆయన పిఏ కిరణ్ అనేక విషయాలలో తల దూర్చి , షాడో మంత్రిగా పేరుగాంచారని , ఇలా అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నప్పటికీ ప్రస్తుత మంత్రులు అధికారులు ఈ విషయంపై ఎలాంటి కార్యాచరణ చేపట్టారు ? అనేది స్పష్టం చేయాలన్నారు.
పీఏ కిరణ్ కన్ను సన లో పువ్వాడ ఉదయ నగర్ సర్పంచ్ రవి , ఆయన సోదరుడు రాంబాబు పువ్వాడ ఉదయ్ నగర్ లో అనేక భూములను కబ్జా చేయడంతో పాటు వాటిని అమ్ముకొని , నిజమైన పేద లబ్ధిదారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై అనేక పత్రికలలో ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ అధికారులు వీటిపై దృష్టి సారించినట్లు కనిపించడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ వీరి దందాలు పువ్వాడ ఉదయ నగర్ లో ఇంకా కొనసాగుతుండటం గర్హనీయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా వీరి మాయ , వీళ్ల అక్రమాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఇటువంటి అనేక భూ అక్రమాలపై నిజాయితీగాన కమిటీ వేయాలని డాక్టర్ కె.వి. కృష్ణారావు డిమాండ్ చేశారు.
2009లో తాడోజు నాగమణి (భర్త వెంకటాచారి) ప్లాట్ నెంబర్ ఏ / 253 తో , సర్వే నెంబర్ 192 లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాను తీసుకున్నారు. కాగా , ఇదే ఇంటి నెంబర్ తో 2017 లో అనగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేరే వారి పేరును చేర్చారు. ఇక్కడ వారు నిర్మాణం కూడా సాగించారు.
ఈ విషయమై అర్బన్ తాసిల్దార్ తో పాటు ఎంపీడీవోలు , ఆర్డీవోలు , సీ పీ, జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. కొత్త ప్రభుత్వం కొత్త మంత్రుల హయాంలోనైనా తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు బాధితుడు తాడోజు వెంకటాచారి ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి బానోతు భద్రు నాయక్ , ఎస్సీ, ఎస్టీ ,బీసీ , మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ షేక్. నజీమా , సావిత్రి మాత సైన్యం జిల్లా కన్వీనర్ ఉపేంద్రబాయి లు మాట్లాడుతూ ఈ భూ అక్ర మాల వెనుక అధికారుల పాత్ర పై కూడా విచారణ నిర్వహించి , వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమాయకంగా పట్టాలు పొందిన పేద వర్గాలకు అన్యాయం జరగకుండా , వారూ నిరాశ్రయులు కాకుండా నిజమైన లబ్ధిదాలను గుర్తించి , స్వాధీనం చేసుకుంటున్న ప్లాట్ల ను వారికి కేటాయించి , న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక కో – కన్వీనర్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.