
వాళ్లిద్దరికి చెక్ పెట్టేలా ఎమ్మెల్సీ కవిత రాజకీయ దూకుడు.. స్ట్రాటజీ మార్చిన కేసీఆర్ తనయ..
గులాబీ పార్టీలో కవితను కంట్రోల్ చేయలేక కేసీఆర్, కేటీఆర్ సహా అందరు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఇదే చాన్స్‌గా కవిత బీఆర్ఎస్ లో ప్రతిపక్ష పాత్రను తానే పోషించేందుకు సిద్దం అయినట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ హైకమాండ్‌కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాటీజీ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గులాబీ పార్టీలో కొనసాగుతూనే.. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు.
ఓ వైపు కేసీఆర్‌ను దేవుడని అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కేటీఆర్, హరీష్ రావులను ఇండైరెక్ట్ గా ఏకి పారేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సమస్యలపై గళం ఎత్తుతున్నారు.
ప్రతిరోజు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం తీరును ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ పోషించాల్సిన పాత్రను .. ఇప్పుడు కవిత పోషిస్తుండటంతో.. ఆమె తీరు అర్థం కాక గులాబీ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు.
కొన్ని విషయాల్లో అయితే గులాబీ లీడర్ల కంటే కవితే ముందుగా స్పందిస్తుండటం గులాబీ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఆషాడం బోనాల సీజన్ మొదలైంది.
ఆషాడంలో తెలంగాణ ప్రజలు అమ్మవార్లను భోనం సమర్పించడం అనేక ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. గతవారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబికా అమ్మవారుకు తొలిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా గోల్కొండ జగదాంబికా అమ్మవారిని దర్శించుకుని.. అమ్మవారికి బోనం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎమ్మెల్సీ కవిత.. తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాల తిరిగి అప్పగించడంపై కవిత స్పందిస్తున్నారు. గతంలో ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఆ లేఖను చూపించి.. చూశారా జాగృతి పోరాటంతోనే ప్రభుత్వం కదిలింది అని కవిత ప్రచారం చేసుకుంటున్నారు.
బీఆర్‌ఎస్ పోరాటం అనకుండా.. జాగృతి పోరాటంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని కొత్త వాదననను అందుకున్నారు.. దాంతో కవిత వైఖరి ఏంటో గులాబీ లీడర్లకు అర్థం కానీ పరిస్తితి నెలకొంది..
రీసెంట్ గా సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో గాయపడ్డ క్షతగాత్రులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. గ్రీన్ ఛానెల్ ద్వారా వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
అయితే కేటీఆర్ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉండటంతో.. ఈ అవకాశాన్ని కవిత చాలా చక్కగా వాడుకుంటున్నారని గులాబీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు.
ఇదే సమయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో కవిత భేటీ తీవ్ర దుమారం రేపుతోంది. కవిత ఇంటికి కేంద్ర మంత్రి వచ్చినట్లు తెలుస్తోంది. కవితతో రాయబారానికి మోడీనే ఆయన్ని పంపారా అనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బీసీ రిజర్వేషన్ సాధనకై పట్టు బిగించిన కవితకు ఆయన మద్దతు తెలిపేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల భేటీపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తంగా గులాబీ పార్టీలో ఉన్నానని చెబుతూనే.. జాగృతిని విస్తరించే పనిలో కవిత ఉన్నారు.. అంతేకాకుండా కేంద్ర మంత్రులతోనూ సఖ్యతగా మెలుగుతూ ఉండటం బీఆర్ఎస్ పార్టీని షాక్‌కు గురి చేస్తోంది.
అసలు కవిత గులాబీ పార్టీని బలోపేతం చేస్తున్నారా..లేక డ్యామేజీ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఏదీ ఏమైనా కవిత దూకుడు మాత్రం గులాబీ లీడర్లకు మింగుడు పడని వ్యవహారంగా మారిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.