వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరిక ప్రకంపనలు సృష్టిస్తోంది. రఘురామకృష్ణరాజు టీడీపీలోకి రావడాన్ని ఎవరూ పెద్దగా వ్యతిరేకించడం లేదు కానీ..ఆయన అభ్యర్థిత్వాన్ని మాత్రం టీడీపీ నాయకులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు.
రఘురామకృష్ణరాజు టీడీపీలోకి వచ్చి రాగానే ఉండి నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు టీడీపీ అధిష్టానం కూడా రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అయితే అప్పటికే ఉండి నియోజకవర్గం టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ఖరారు చేశారు.రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరడంతో రామరాజును పక్కన పెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఇదే విషయాన్ని రామరాజుకు సైతం తెలియజేశారు.
ఈ నిర్ణయంపై ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘురామ కృష్ఱంరాజుకు టికెట్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న రామరాజును కాదని..ఇటీవల పార్టీలో చేరిన రఘురామ కృష్ఱంరాజుకు ఉండి సీటు ఎలా ఇస్తారని కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.
రామరాజునే ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగించాలని టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే గురువారం ఈ నిరసన సెగ భీమవరాన్ని తాకింది. భీమవరంలో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వద్ద తెలుగు తమ్ముళ్లు ధర్నా నిర్వహించారు.
ఎమ్మెల్యే రామరాజు వర్గీయులు ఉండి నుంచి భీమవరం ర్యాలీ నిర్వహించి సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. టికెట్ రామరాజుకే ఉంచాలని, ఇక్కడ వేరేవారిని తీసుకొస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు.
ఇప్పటికే ఉండి నియోజకవర్గ టీడీపీలో రెండు వర్గాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు,మాజీ ఎమ్మెల్యే శివరామరాజుల మధ్య తీవ్ర అధిపత్య పోరు నడుస్తోంది. రామరాజుకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
శివరామరాజు వర్గం ఓట్లే పోతాయని టీడీపీ ఆందోళన చెందుతున్న తరుణంలో ..ఇప్పుడు రఘురామకు టికెటిస్తే తాను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ఎమ్మెల్యే రామరాజు చెప్పడం టీడీపీని సంకటంలో పడేస్తోంది. టీడీపీ వర్గపోరు అధికార వైసీపీకి కలిసి వచ్చేలా ఉంది. ఇక్కడ వైసీపీ పెద్ద చెమటోడ్చకుండా విజయం సాధించేలా కనిపిస్తోంది.