కరెంట్ షాక్‌తో మరణిస్తే 5 లక్షలు పరిహారం
నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి
సంబంధిత పత్రాలన్నీ జతపర్చాలి
విద్యుత్తు షాక్‌లతో మరణిస్తే ప్రభుత్వం రూ.5లక్షలు నష్టపరిహారం చెల్లిస్తుంది. చిన్నా, పెద్దా అన్న తేడాలేకుండా అందరికీ రూ.5 లక్షలు ఇస్తుంది. విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం, స్టే వైర్ (పోల్ సపోర్ట్ తీగలు), విద్యుత్తు లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ నష్టపరిహారం అందజేస్తుంది. అలాగే వర్షాలు, గాలులతో తీగలు తెగి రోడ్ల మీద పడినప్పుడు చూడకుండా తొక్కి మరణించినా లేదా తీగల మీద నుంచి వాహనాలు వెళ్లడంతో మరణాలు సంభవించినా నష్టపరిహారం ఇస్తుంది.
పంట పొలాల్లో కరెంటు తీగలు తగిలి మరణాలు చోటుచేసుకున్నా నష్టపరిహారం చెల్లిస్తుంది. ఒకవేళ పశువులు మరణించినా కూడా రూ.40,000 పరిహారాన్ని విద్యుత్తు శాఖ అందజేస్తుంది. అయితే శాఖ పరమైన తప్పిదం వల్ల ప్రమాదాలు చోటుచేసుకొని మరణాలు సంభవిస్తేనే పరిహారం చెల్లిస్తుంది. లేకుంటే ఇవ్వద్దు. ఉదాహరణకు ఇంట్లో అంతర్గత వైరింగ్ కారణంగా షాక్ తగిలి మరణం సంభవిస్తే పరిహారం అందజేయదు.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
కరెంటు షాక్ మరణం సంభవించిన నాటి నుంచి నెల రోజులలోపు అన్ని రకాల డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు సమర్పించాలి.
అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) ప్రాథమిక విచారణ జరుపుతారు. సంబంధిత డివిజినల్ ఇంజినీర్ (డీఈ) సమగ్ర విచారణ జరిపి పై అధికారులకు నివేదికను సమర్పిస్తారు.
నష్టపరిహారాన్ని సంబంధిత డీఈ కార్యాలయం నుంచి పొందవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్లు..
పోలీసు ఎఫ్‌ఐఆర్, పంచనామా నివేదిక, డెత్ సర్టిఫికెట్, తాసిల్దార్ జారీచేసిన చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రం, సంఘటన ఫొటో, సంఘటన లోకేషన్.