మరోసారి ఆ మాట అంటే చెప్పుతో కొడ్త..
తొలిసారి కట్టలు తెంచుకున్న హరీష్ రావు కోపం
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే అంశం పరిశీలనలో ఉందని అన్నారు.
పదేళ్లలో తాము రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. పాలనా సంస్కరణలను గ్రామాల్లోకి తీసుకెళ్లామని అన్నారు. తెలంగాణ జీడీపీని పెంచామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదని అన్నారు.
తాను ఏక్‌నాథ్ షిండే కాదని.. పార్టీ మారే వ్యక్తిత్వం తనది కాదన్నారు. పదవిలో ఉన్నా.. లేకున్నా వ్యక్తిత్వం కాపాడుకుంటా అన్నారు. ‘మరోసారి నేను పార్టీ మారుతానని ప్రచారం చేస్తే వారిని చెప్పుతో కొడ్తా’ అని హరీష్ రావు సీరియస్ అయ్యారు.
ఏక్‌నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డే అన్నారు. వందరోజుల్లోనే గ్యారంటీలన్నీ అమలు చేస్తామని గొప్పలకు పోయి.. ఇవాళ కోడ్ అడ్డొచ్చిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు పెట్టని రోజు లేదని ఆవేదన చెందారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చాక ఏ ప్రాంతంలోకి వెళితే.. ఆ ప్రాంతంలో రైతులకు నీళ్లు వదులుతున్నారని అన్నారు.
బలవంతంగా ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు ఉండటం సహజం అన్నారు. కాంగ్రెస్‌లో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎవరూ చేరడం లేదని.. బలవంతంగా చేర్చుకుంటున్నారని కీలక ఆరోపణలు చేశారు.