ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలంలో గల పిప్పల్ దరి గ్రామంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది.ఈ ఘటనలో యువతి మృతి చెందగా, ప్రేమికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన యువతీ అదే గ్రామానికి చెందిన భుజంగ్ రావు ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిపారు.
శనివారం వీరు ఇద్దరు గ్రామ సమీపంలోని ఓ పొలానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారని, అక్కడే మోనోసిల్ అనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఇది గమనించిన స్థానికులు సాయంత్రం సమయంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వీరిని తరలిస్తుండగా యువతి మార్గమధ్యలో మృతి చెందగా, భుజంగ్ రావును రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారన్నారు. ప్రస్తుతం భుజంగ్ రావు పరిస్థితి కూడా విషమంగా ఉందని వెల్లడించారు.
అయితే భుజంగ్ రావుకు ఇంతకుముందే పెళ్లి అయిందని,అతనికి భార్యా, పిల్లలు ఉన్నారని ఎస్సై పేర్కొన్నారు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురికి తరలించారు.