సీఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ హరీష్ రావు
సిద్దిపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్దమైనవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డికి దేవుడు శాపాలు పెట్టారని.. ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడరంటూ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట అభివృద్ధిని సీఎం కండ్లు ఉండి చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిందని తెలిపారు.
సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదని.. సిద్దిపేటకు తాము ఎం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటకు మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్ ఎన్నో తెచ్చామని.. అన్నింటికి మించి తెలంగాణ తెచ్చామని చెప్పుకొచ్చారు.
ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నా…
రేవంత్ రెడ్డి సీఎం అయ్యారంటే సిద్దిపేట పుణ్యమే అని.. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మోచేతి నీళ్లు త్రాగేవారని విమర్శించారు. నిన్నటి వరకు మెదక్ అభివృద్ధి జరిగిందని మాట్లాడింది నిజమా?… నేడు సిద్దిపేట అభివృద్ధి జరగలేదు అనేది నిజమా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15న సిద్దిపేటకు వస్తా అనే సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం తనకు అలవాటన్నారు.
వంద రోజులులో ఆరు గ్యారంటీలు, రెండు లక్షల రుణమాఫి చేస్తే రాజీనామా ఆమోదించుకుని సీఎంకు శాలువా కప్పుతానని సవాల్ చేశారు. వ్యక్తిగా తన కంటే కోట్లాది ప్రజలకు న్యాయం జరగడమే తాను కోరుకునేదని తెలిపారు.
రేవంత్ రాజీనామాకు సిద్ధమా?
‘‘రేవంత్ రెడ్డి బాండ్ పెపర్ బౌన్స్ అయింది. రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?.. లేకుంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా?. వంద రోజులులో గ్యారంటీలు అమలు చేస్తే నేను స్పీకర్ పార్మాట్లో రాజీనామా చేస్తా . ఒకరేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు.
మరొకరేమో దేవుని మీద ఓట్లు పెట్టి ఓట్లు అడుగుతారు. మీ పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేల్ అయింది . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూమి కొనేవారు లేకుండా పోయారు . రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులు చూపెడుతున్నారు. నేడు రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఉద్యోగాలు రాకుండా పోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది.
గత ప్రభుత్వాన్ని బాద్నా చేయాలని సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి . సిద్దిపేట అభివృద్ధి ప్రజల ముందు కనబడుతుంది. సిగ్గు లేకుండా మాట్లాడకు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఉంది. కేసీఆర్ బస్‌యాత్ర సుపర్ హిట్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నయా నాటకాలు ఆడుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు.
ఢిల్లీకి రేవంత్ గులాం గిరి..
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ లేకుండా చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థిని, బీజేపి అభ్యర్థి బలంగా ఉన్న చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రే
వంత్ పాలన 5 నెలల్లోనే రివర్స్ గేర్‌లో నడుస్తుందన్నారు. 5 నెలలోనే కరెంట్ కోతలు వచ్చాయని, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగాయని, కొత్తవి ఇస్తలేరు కానీ పాత పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు. రైతులకు రైతుబంధు ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పు తీసుకుని పంటలు వేసుకున్నారని తెలిపారు.
తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి గులాం గిరి చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు పోతాయని రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. హిందువుల ఆస్తులు పోతాయని మోదీ అంటున్నారని.. హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ ప్రజలు ఊరురని హెచ్చరించారు.
సిద్ధిపేటను రద్దు చేసే కుట్ర..
ప్రజలను సెంటిమెంటల్‌గా రెచ్చగొట్టి కాంగ్రెస్, బీజేపీ ఓట్లు అడుగుతున్నారన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అంటున్నారని.. అది నిజమైతే ఈడీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో రేవంత్ రెడ్డి మాటల్లో అంతా నిజం ఉంటదంటూ సెటైర్ విసిరారు.
కేసీఆర్ ఇచ్చిన సిద్దిపేట వెటర్నరీ కాలేజ్‌ను గద్ద లాగా కొడంగల్‌కు రేవంత్ రెడ్డి లాక్కొని పోయారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాను తీసి అభివృద్ధిని ఆపుతావా రేవంత్. జిల్లాను తీస్తా అన్న రేవంత్‌కు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని హరీష్‌రావు పేర్కొన్నారు..