ప్రమాదమా.. గాయాలేవీ? కేసులో ట్విస్ట్ !
ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం పరిధిలోని హర్యాతండా వద్ద తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.కుక్క అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయగా రోడ్డు ప్రమాదం జరిగిందని కారు నడిపిన మృతురాలి భర్త చెప్తుండగా, డెడ్‌బాడీలపై ఒక్క గాయం లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
రఘునాథపాలెం మండలం బావోజితండాకు చెందిన బొడా ప్రవీణ్‌కు ఏన్కూరు మండలం రాంనగర్ తండాకు చెందిన కుమారి(25) కి కొన్నేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి కృషిక(4) , కృతిక (3) అనే కూతుళ్లున్నారు.
మంగళవారం భార్యాభర్తలు, పిల్లల ఆధార్ అప్డేట్ చేయించడానికి కారులో ఖమ్మం వెళ్లారు. సాయంత్రం మంచుకొండ మీదుగా బావోజితండాకు వస్తుండగా హర్యాతండా వద్ద కుక్క అడ్డు వచ్చిందని, దీంతో సడన్ బ్రేక్ వేయగా అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టిందని ప్రవీణ్ చెప్తున్నాడు.
ప్రమాదంలో కుమారి, పిల్లలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ప్రవీణ్ నడుము విరగడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రవీణ్ హైదరాబాద్‌లోని అత్తాపూర్ లో ఉన్న జర్మన్ టెక్ హాస్పిటల్ లో ఫిజియోథెరపిస్ట్.
మా కూతురిని చంపేశారు
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసే కేరళకు చెందిన అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్ ఆమెతో కలిసి కేరళ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రవీణ్ ఆచూకీ కనుగొని తీసుకువచ్చిన కుమారి తల్లిదండ్రులు హన్మకొండ ప్రాంతంలో పసరు మందు తాగించారు.
అయినా తీరు మార్చుకోని ప్రవీణ్.. భార్య కుమారిని చంపేస్తానంటూ బెదిరించేవాడు. పెద్ద మనుషుల పంచాయితీ అనంతరం భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్న ప్రవీణ్ కుటుంబంతో సహా 20 రోజుల క్రితం భావోజితండాకు వచ్చాడు.
మే 25న ప్రవీణ్ దంపతుల పెళ్లి రోజు కాగా.. ఆ రోజు ప్రవీణ్ అందుబాటులో లేకపోవడంతో కుమారి, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తన తమ్ముడితో వాట్సాప్‌లో చాటింగ్ చేసిన కుమారి..తమ్ముడా ఉదయం ఇంటికి వస్తా.. నేను ఇక్కడ ఉండలేక పోతున్నా.. నా వల్ల కాదు’ అంటూ కన్నీరు పెడుతున్న ఫొటోలు పంపింది.
స్పందించిన ఆమె సోదరుడు.. ఉదయం వస్తా, బావ కూడా వస్తా అన్నాడు అని బదులిచ్చాడు. మంగళవారం సాయంత్రం మంచుకొండ నుంచి భావోజీతండాకు ప్రవీణ్ తన భార్యాబిడ్డలతో కలిసి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు రహదారి పక్కన ఓ చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో వున్న కృషిక, కృతిక అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన కుమారి ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతొ కుమారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.