నెలాఖరులోగా కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు?.. భూముల విలువ 20-40 శాతం పెంపు!
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
భూముల విలువ సవరణపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఆదేశిస్తే వెంటనే పెంపుదల అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా ఆదేశాలు రావొచ్చని, దాదాపు 20-40 శాతం వరకు పెంపుదల ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది మే 16న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెంచాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.14,295 కోట్లు వచ్చింది. లక్ష్యంలో 77 శాతం మాత్రమే ఆదాయం రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
చాలా చోట్ల భూముల మారెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉన్నదని, కాబట్టి భూముల విలువ, స్టాంపు డ్యూటీని సవరించాలని ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్లో ఎంత మేర పెంచవచ్చో నివేదికలు సిద్ధం చేశారు. ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి ఎలా ఉన్నదో అధ్యయనం చేసి రెవెన్యూ శాఖ మంత్రికి వివరాలు అందజేసినట్టు తెలిసింది. వీటిని పరిశీలించిన అనంతరం భూముల విలువను ఎంత మేర సవరించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌కు కసరత్తులు ప్రారంభించింది. శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేసన్ల శాఖలో పెంచబోయే ధరలకు అనుగుణంగానే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం రూ.18500 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా.. ఈసారి రూ.20-21వేల కోట్ల మధ్యలో అంచనాలు ఉండొచ్చని చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాదితో పోల్చితే కనీసం 40 శాతం అదనపు ఆదాయం సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తున్నది.