
పార్లమెంట్‌లో భద్రతా లోపం… గోడ దూకి భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం
శుక్రవారం పార్లమెంటు భవనం వద్ద భద్రతా ఉల్లంఘన ఘటన చోటు చేసుకుంది. ఆగంతకుడు ఒకరు శుక్రవారం నాడు.. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
గోడ దూకి భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు అధికారుల తెలపారు. అయితే పార్లమెంటు భవనం ఆవరణలో ఉన్న భద్రతా దళాలు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆగంతకుడు శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంటులోకి ప్రవేశించాడని భద్రతా వర్గాల సమాచారం.
అతను రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనం గరుడ్ గేట్ వరకు చేరుకున్నాడు. అయితే పార్లమెంట్ లోపల ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు ఈ సంఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21న ముగిశాయి.
గత సంవత్సరం ఆగస్టులో కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘన సంఘటన జరిగింది. 20 ఏళ్ల ఒక వ్యక్తి గోడ దూకి పార్లమెంటు అనుబంధ ప్రాంగణంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.