రైతులకు న్యాయం చేస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నమ్మకంతో కాల్వకు భూములిచ్చిన రైతుల రుణం తీర్చుకోలేనిదని..
వారికి న్యాయం చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హిమాంనగర్ సమీపంలోని సీతారామ అనుసంధాన కాల్వ పనులను శనివారం పరిశీలించారు. హిమాంనగర్ నుంచి పనులు జరిగే ప్రదేశం వరకు ద్విచక్ర వాహనం నడుపుతూ ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌తో కలిసి వెళ్లారు. పరిహారం ఎంతిస్తామో తెలియకపోయినా భూమి, పంటను నష్టపోయి కాల్వ తవ్వేందుకు సహకరించిన ప్రతి రైతుకు రుణపడి ఉంటామన్నారు.
ఇలాంటి కర్షకులందరికీ ముఖ్యమంత్రితో చెక్కులు ఇప్పించేలా చూస్తామని తెలిపారు. రైతుల పిల్లలకు జీవనోపాధి కల్పించేలా చొరవ చూపుతామన్నారు. బొర్రా రాజశేఖర్, గుత్తా వెంకటేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలో మంత్రి పర్యటన
ఖమ్మం కమాన్‌బజార్ : ఖమ్మం నగరంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం విస్తృతంగా పర్యటించారు. వివిధ డివిజన్లల్లో ఇటీవల మరణించిన వ్యాపారవేత్త నయీమ్, మైబూబ్ మియా కుటుంబాలను పరామర్శించారు.
తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్దార్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తూ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ బాధ్యులు తమ ప్రాంతాల్లో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ధంసలాపురం చెరువు కాలుష్యాన్ని అరికట్టాలి
ధంసలాపురం చెరువు కాలుష్యాన్ని అరికట్టాలని మత్య్సకారులు మంత్రి తుమ్మలకు వినతి పత్రం సమర్పించారు. నగరం నుంచి వస్తున్న మురుగు నీటి కారణంగా చెరువు కలుషితమవుతుందని అందులో పేర్కొన్నారు.
తద్వారా చేపలు మృత్యువాత పడి నష్టపోతున్నామని వివరించారు. ఇప్పటికే 15 టన్నుల చేపలు చనిపోయాయని గుర్తు చేశారు. గతంలో మురుగు నీటిని దారి మళ్లించి కాలుష్యాన్ని నివారించేందుకు తయారు చేసిన ప్రతిపాదనలు పరిశీలించాలని కోరారు.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు రావుల హన్మంతరావు, మత్య్స సంఘం అధ్యక్షుడు అప్పారావు, స్థానిక నాయకులు రావూరి సైదుబాబు, పగడాల మల్లేష్ పాల్గొన్నారు.