నా ఓపికను పరీక్షించొద్దు… సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం నారా చంద్రబాబు తొలిసారి స్పందించారు. సోమవారం నాడు సెకట్రేరియట్‌లో గత ప్రభుత్వం గనుల శాఖలో చేసిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా.. శాంతి భద్రతలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా మాట్లాడారు.
రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారికి సీబీఎన్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇక చూస్కోండి..!
‘ఏపీలో ఎవరైనా ఇంకా మత్తులో ఉంటే వారికి గట్టి హెచ్చరికలు చేస్తున్నాం. ఇంకా నా ఓపిక, సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇలాంటి వారికి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇస్తాను.. అది ప్రజలందరూ చూస్తారు. నంద్యాలలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన.. విజయనగరంలో ఆర్నెళ్ల పసికందుపై అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది.
ఈ కేసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరిత గతిన విచారణ చేయాలి. బాధిత కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. ఇకపై ఇలాంటి ఘటనలు పాల్పడే వారికి కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పేశారు.
ఎవ్వరినీ వదలను..!
‘ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు ఉంటాయి. నేరస్థులు, దోపిడీదారులను కఠినంగా శిక్షిస్తాం. TDR బాండ్లు, రేషన్ బియ్యంలో అక్రమాలు జరిగాయి. దొంగకు తాళాలు ఇచ్చి దోచుకునేలా గత ప్రభుత్వం చేసింది.
పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయి. ప్రకృతి సంపద ప్రజలకు చెందాలి. గనుల బాధితులు మందుకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి.
ఎర్రచందనం దొంగ రవాణా కోసం అక్రమాలు జరిగాయి. ఎర్రచందనాన్ని చైనాకు దొంగ రవాణా చేశారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని తగ్గించారు. ఎర్రచందనం స్మగ్లర్లను వైసీపీ నేతలు ప్రోత్సహించారు. స్మగ్లర్లను ప్రోత్సహించడం సమాజానికి ప్రమాదం.
పల్నాడు జిల్లాలో ఇష్టానుసారం అటవీసంపద దోపిడీ జరిగింది. రుషికొండ కట్టడాలు.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తాం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.