APGVB బ్యాంక్ కి తాళం వేసి రైతుల నిరసన…
తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఏపీజీవీబీ బ్యాంక్ పరిధిలో సుమారు 7 గ్రామాలకు చెందిన 200 మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళనతో మంగళవారం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తక్షణమే రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం బేషరతుగా ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుబంధు నగదు విడుదల చేయాలన్నారు. ఏపీజీవీబీ పరిధిలోని ఒక్క గ్రామంలో కూడా 50 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని,
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం వ్యవసాయాధికారుల కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ సాధారణ రైతులను తిప్పించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదన్నారు.
గత ప్రభుత్వాల మాదిరిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా సాగుచేసే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.