‘ఇంతి’౦తై భద్రకాళి…!
- సాధారణ కార్యకర్త నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్థాయికి …!
- పొంగులేటి విధేయురాలిగా మద్దులపల్లి మార్కెట్ కమిటీలో చోటు దక్కనుందని ప్రచారం
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం రూరల్ : ఆమెకు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ…. రాజకీయాల్లో రాణించాలనే తపనతో ఇరవై ఏళ్ల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లో కార్యకర్తగా అడుగుపెట్టింది.
సర్పంచ్ గా పోటీ చేసి పరాభవం పొందినప్పటికీ వెనకడుగువేయకుండా ఆమె ఉంటున్న గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందడంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో రైతు సమన్వయ కమిటీలో చోటు దక్కించుకుంది.
అనివార్యకారణాల రీత్యా తన అభిమాన నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి రావడంతో ఆమె కూడా ఆ పార్టీకి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. ఆమె ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన కర్లపూడి భద్రకాళి.
సాధారణ కార్యకర్త స్థాయి నుంచి….!
సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో కీలకమైన మద్దులపల్లి మార్కెట్ కమిటీలో చోటు దక్కించుకునే స్థాయికి ఎదిగింది.
గత పదేళ్లుగా పొంగులేటి అడుగుజాడల్లో నడుస్తూ అతనికి విధేయురాలిగా ఉంటూ వస్తుంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తన గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చేలా కృషి చేయడమే కాకుండా పొంగులేటి కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ గెలుపును కోరుతూ ప్రచారం చేసింది.
వీటన్నింటిని గుర్తించిన మంత్రి రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్న మార్కెట్ కమిటీల్లో మహిళా కోటాలో డైరెక్టర్ గా భద్రకాళికి చోటు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతుంది.
పొంగులేటి శీనన్నను నమ్ముకున్న వారికి గౌరవంతో పాటు ఉన్నత పదవులు దక్కుతాయని భద్రకాళి చెబుతుంది. పదవి వచ్చినా రాకున్నా తన పయనం పొంగులేటి శీనన్నతోనే సాగుతుందని స్పష్టం చేసింది.