హథీరాం బావాజీ ఆలయం ప్రాంగణంలో భీభత్సం
– తెల్లవారుజామున ఆలయ కట్టడాలు కూల్చివేత
– తిరగబడిన బంజార జాతి ప్రజలు
– అడ్డుకుంటారని బంజార సేవా సంఘ నాయకుడి అక్రమ అరెస్ట్
తిరుపతి:
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసునితో పాచికలు ఆడిన హాథీరాం బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో నిర్మిస్తున్న ఆలయం ప్రాంగణం గురువారం తెల్లవారుజామున రణగోణధ్వనులతో మార్మోగింది.
ఆలయంకు చెందిన కట్టడాలను జేసీబీలతో చీకట్లో కూల్చేశారు. బంజార జాతి ప్రజలు అడ్డుకున్నా, కోర్డు ఇంజెక్షన్ అర్డర్లు ఉన్నాయని మొత్తుకున్నా, పోలీసులతో కలిసి హాథీరాంజీ మఠం అధికారులు ధ్వంసం చేశారు.
ఆలయ ప్రాంగణంలోని నిర్మాణాలను తొలగించేందుకు అడ్డుకుంటారనే అనుమానంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకుడు శివనాయక్‌ను అర్థరాత్రి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి మరీ నిర్మాణాలను తొలగించడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్లితే…
తిరుపతికి సమీపంలోని వేదాంతపురం పంచాయతీ పరిధిలో హాథీరాంజీ మఠంకు చెందిన భూముల్లో హాథీరాం బావాజీ ఆలయాన్ని గత కొంత కాలంగా బంజారా జాతికి చెందిన కొందరు నిర్మిస్తున్నారు.
బంజారాలు పూజించే హా«థీరాం బావాజీకి ఇప్పటి వరకు ఆలయం లేకపోవడంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు శివనాయక్ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ప్రపంచంలోనే ప్రప్రథమంగా బావాజీ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
బంజారా జాతికి చెందిన దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే బంజారాలు స్వామి దర్శించుకుని, వసతి పొందేందుకు వసతి గృహాలను నిర్మిస్తున్నారు.
బంజారాల విజ్ఞప్తి మేరకు గతంలో హాథీరాంజీ మఠం మహంతుగా పనిచేసిన అర్జునదాస్ ఆలయానికి భూమిని కేటాయించారని అందులోనే ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు బంజారా సేవా సంఘం నాయకుడు శివనాయక్ పలుమార్లు ప్రకటించారు.
కొందరు మఠంకు చెందిన అధికారులు అవినీతికి సహకరించలేదనే కక్షతో ఆలయాన్ని, భక్తుల వసతి గృహాలను తొలగించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్లు తెలిపారు. అధికారుల బెదిరింపులతో కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్‌ను పొందినట్లు తెలిపారు.
అయితే అర్థరాత్రి శివనాయక్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.
అనంతరం మఠం ఏఏఓ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది పోలీసులతో వచ్చి హాథీరాం బావాజీ ఆలయం ప్రాంగణంలోని వసతి సముదాయం, విజ్ఞాన మందిరం, పోటు, పూజాసామాగ్రిని ఉంచే గదులను కూల్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, బంజారా జాతి ప్రజలు అడ్డుకున్నారు,
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఎలా ఆలయ ఆస్తులను ధ్వంసం చేస్తారని నిలదీశారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. అయినా మఠం సిబ్బంది దౌర్జన్యంగా నిర్మాణాలను తొలగించారు.
దౌర్జన్యంగా కుల్చేశారు..
వేల కోట్ల ఆస్తులు ఉన్న కూడా హాథీరాంజీ మఠం అధికారులు హాథీరాం బావాజీకి ఇంత వరకు ఆలయాన్ని నిర్మించలేదు. బంజారాలు ఆరాధించే బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో ఆలయాన్ని నిర్మించేందుకు బంజారా సేవా సంఘం పలుమార్లు మహంతు అర్జునదాస్‌ను విన్నవించాం.
ఆయన స్థలం కేటాయించడంతోనే చందాలు వేసుకుని మరీ బంజారాలు కలిసి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పుడు కూల్చివేయడం అన్యాయం. అక్రమం.
– శివనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంతిరుపతి జిల్లా అధ్యక్షుడు