మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు చెర్లకోల్ల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. తన భర్త లక్ష్మారెడ్డితో పాటు వైద్య సేవలు అందించి.. రాజకీయంగా ఆయనకు అండగా ఉంటూ వచ్చింది. పార్టీ నాయకులు కార్యకర్తలు.. శ్రేణులతో కలిసిమెలిసిపోయి పార్టీ బలోపేతంలో.. లక్ష్మారెడ్డి రాజకీయ ప్రయాణంలో అండగా నిలుస్తూ వచ్చింది. ఆవంచ గ్రామ సర్పంచిగానూ పనిచేశారు. శ్వేతారెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శ్వేతా లక్ష్మారెడ్డితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.
శ్వేతా రెడ్డి పార్థివదేహాన్ని చెన్నై నుండి మంగళవారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకువస్తారని అక్కడి నుండి నేరుగా జడ్చర్ల మీద నుండి స్వగ్రామమైన ఆవంచకు తీసుకురానున్నారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆవంచ గ్రామములో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా శ్వేతా లక్ష్మారెడ్డి మృతి పట్ల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.