
హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. తాళాలు పగులగొట్టి..
హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఇనాంగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి మూడు రియల్ ఎస్టేట్ కార్యాలయాల తాళాలు పగులగొట్టి అందులోకి ప్రవేశించారు.
ఆఫీసులో ఉన్న వస్తువులను చిందర వందరగా పడవేశారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్యాలయ ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. వరుసగా మూడు రియల్ ఎస్టేట్ కార్యాలయాలతో పాటు ఓ ఇంట్లో చోరీకి దొంగలు పాల్పడ్డారు.
రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారుని ధ్వంసం చేశారు. మరో ఇంట్లో ఉన్న కారుని వేసుకొని స్థానికంగా దర్జాగా తిరిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ చోరీల్లో సుమారు రూ. 30 వేల నగదుని దొంగలు అపహరించారు.

బాధితులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. సీసీ టీవీలో రికార్డు అయిన ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దొంగల ప్రవర్తనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలనీల్లో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, భద్రత పరంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు..