తిరుమల లడ్డూలో అంబర్ ప్యాకెట్.. ఖమ్మం జిల్లాలో కలకలం
షాకైన భక్తులు..!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువు నూనె(కొవ్వు ) కలిసిందని ప్రచారం జరుగుతుండడంతో భక్తులందరూ అవాక్కయ్యారు. దీంతో దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ వస్తోంది.చివరికి ఇది టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
నెయ్యికి బదులుగా జంతువులు కొవ్వు ఉపయోగించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేదు అలాంటి ఏమి జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. తిరుమలలో జరిగిన తప్పుతో తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం మంచి కోసమే ఈ దీక్ష చేస్తున్నట్లు వివరించారు.
కోట్లాది మంది శ్రీవారిని విశ్వసించే భక్తులను తిరుమల లడ్డూ కల్తీ ఘటన ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. ఇది హిందుత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇది ఇలా ఉంటే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో తిరుపతి లడ్డూ మరోసారి అపవిత్రమైనట్లు వార్తలు వస్తున్నాయి.
గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెల్లి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు బంధువులు, ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూలు తీసుకొచ్చారు.
ఆదివారం లడ్డూను పంచేందుకు కవర్ నుంచి లడ్డూలను బయటకు తీశారు. దీంతో లడ్డూలో అంబర్ ప్యాకెట్ కనిపించడంతో భక్తులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లడ్డూ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. లడ్డూ ప్రసాదంలో కల్తీ అవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే లడ్డూలో జంతువు కొవ్వును కలపడంపై మండిపడుతున్నారు.