మూణ్నెళ్లుగా జీతాల్లేవ్..
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తండ్లాట!
ఎక్కే మెట్టు.. దిగే మెట్టు అన్నట్టుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్న దుస్థితి
పండుగ ఎలా చేసుకోవాలంటూ నాన్‌రెగ్యులర్ సిబ్బంది ఆవేదన
రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు సగటున 4-9 నెలలుగా వారికి వేతనాలు చెల్లించటం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేయగా, రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఎట్లా వెళ్లదీయాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు.
జీతాలు ఇవ్వండి మహాప్రభో అంటూ సర్కారును వేడుకొన్నా ఆలకించని పరిస్థితి నెలకొన్నదని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్నిప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, జిల్లా, మండల కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో ఔటసోర్సింగ్, పార్ట్‌టైం, హానరోరియం, కాంట్రాక్ట్ ప్రాతిపదికపై దాదాపు 1.50 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారు.
అటెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వాచ్‌మెన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, వైద్యరంగంలో ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు, విద్యారంగంలో బోధన, బోధనేతర విభాగాల్లో, స్పెషలాఫీసర్లుగా, అటవీశాఖలో వాచర్లుగా, ఉపాధి హామీ పథకంలో ఎఫ్‌ఏలుగా, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రత్యేక ప్రాజెక్టుల్లో ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లు, ట్రైనర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ప్రాజెక్టు ఆఫీసర్లు, ఇరిగేషన్‌శాఖలో పంప్‌హౌజ్‌ల్లో నైట్‌వాచ్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానికల్ ఇంజినీర్లు, ఆపరేటర్లు ఇలా దాదాపు అన్ని శాఖల్లో ఏదో ఒక విభాగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వశాఖలు నేరుగా వీరిని నియమించుకోగా, మరికొన్ని శాఖలు జిల్లాలవారీగా మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకున్నాయి.
4 నుంచి 9 నెలలుగా అందని వేతనాలు
ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఎలా అందుతున్నాయో చెప్పేందుకు ఒక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీనే నిదర్శనంగా నిలుస్తున్నది. సొసైటీలో పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, సీవోఈల్లో, కళాశాలల్లో, స్పోర్ట్స్ అకాడమీల్లో ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీ, హానరోరియంపై వేల మంది పనిచేస్తున్నారు.
సదరు సిబ్బందికి ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు వేతనాలనూ ఇప్పటికీ చెల్లించలేదు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, సెర్ప్, ఉపాధిహామీ పథకం ఉద్యోగులు, వీఏవోలు, వాచర్లు.. ఇలా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి సగటున 4-9 నెలలుగా జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
కాళ్ల మీద పడుతున్నా కనికరించని సర్కారు
జీతాల కోసం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్నవిధంగా ప్రధాన కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళ్లపై పడి జీతాలు చెల్లించాలని అక్కడి ఓ గేట్ ఆపరేటర్ వేడుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయినా సర్కారు ఏమాత్రం కనికరం చూపించని దుస్థితి నెలకొన్నది. వాస్తవంగా చాలా శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గడువు జూన్ 31తోనే ముగిసింది. ఆయాశాఖల అధికారులు సదరు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ రెన్యువల్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
వారిని ప్రస్తుతం మౌఖిక ఆదేశాలతో పనిచేయించుకుంటున్నారు తప్ప ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అటు ప్రతిపాదనలు పట్టించకోక.. బకాయి వేతనాలు చెల్లించక ప్రభుత్వం నాన్చుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మానవీయకోణంలో స్పందించి వేతనాలను విడుదల చేయాలని ఔటసోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.
తక్షణమే వేతనాలు చెల్లించాలి
ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో అనేక మంది అప్పుల పాలయ్యారు.
ప్రస్తుతం అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొన్నది. పండుగ సమీపిస్తున్నది. ప్రభుత్వం తక్షణం మానవీయకోణంలో స్పందించాలి. బకాయి వేతనాలు చెల్లించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ఆదుకోవాలి.
– పులి లక్ష్మయ్య, తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు